సస్యరక్షణ పద్ధతుల‌తో మెరుగైన దిగుబడులు

కలం, జోగులాంబ‌ గద్వాల: పంటల్లో చీడపీడలను ప్రారంభ దశలోనే గుర్తించి, శాస్త్రీయ సస్యరక్షణ పద్ధతులు పాటించడం ద్వారా పంట నష్టాలను తగ్గించుకోవచ్చని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, కోఆర్డినేటర్, అర్చన సూచించారు. గురువారం అలంపూర్ డివిజన్ పరిధిలోని భుక్కాపురం, జోగులాంబ, అలంపూర్ గ్రామాల్లో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (TRVK Scientists ), RARS పాలెం శాస్త్రవేత్తలు (RARS Palem Scientists) పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మిరప పంటలో బోరాన్, మెగ్నీషియం లోపాలను గుర్తించిన శాస్త్రవేత్తలు వాటి నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము బోరాన్, 4–5 గ్రాముల మెగ్నీషియం కలిపి పిచికారీ చేయాలని సూచించారు.

అనంతరం నాలుగు రోజుల వ్యవధిలో అగ్రోమిన్ మ్యాక్స్, మరో నాలుగు రోజుల తర్వాత ఫార్ములా-7 పిచికారీ చేయాలని తెలిపారు. పత్తి పంటలో గులాబీ రంగు కాయతొలుచు పురుగు ఉనికిని గుర్తించి, రెండో ఏర పూర్తయిన తర్వాత పంటను కొనసాగించడం ఆర్థికంగా లాభదాయకం కాని పరిస్థితుల్లో పంటను తొలగించి, పత్తి అవశేషాలను సక్రమంగా తొలగించాలని సూచించారు. సుమారు 50 రోజుల వయస్సున్న మినుము పంటలో పసుపు రంగు మొజాయిక్ వైరస్, మారుకా పురుగు లక్షణాలను గుర్తించారు. వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు రసం పీల్చే పురుగులను నియంత్రించాలని, మారుకా పురుగు నివారణకు ఎకరానికి 80 మి.లీ. యాంప్లిగో వినియోగించాలని సూచించారు.

సుమారు 30 రోజుల వయస్సు ఉన్న‌ శనగ పంటలో బీట్ ఆర్మీవార్మ్ పురుగు ఉనికిని గుర్తించి, గుడ్ల సమూహాలు, చిన్న లార్వాలను సేకరించి నాశనం చేయాలని, అవసరమైనప్పుడు సిఫారసు చేసిన జీవ నియంత్రణ పద్ధతులు, పురుగుమందులను వినియోగించాలని తెలిపారు. మొక్కజొన్నలో ఫాల్ ఆర్మీవార్మ్ పురుగు తీవ్రంగా ఆశించినందున పంటను తరచుగా పరిశీలిస్తూ, గుడ్ల సమూహాలు, చిన్న లార్వాలను తొలగించి, అవసరమైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. సుమారు రెండు నెలల వయస్సున్న పొగాకు పంట ఆరోగ్యంగా ఉన్నందున ప్రస్తుతం పురుగుమందుల పిచికారీ అవసరం లేదని, పంటను నిరంతరం పరిశీలించాలని తెలిపారు. ఈ క్షేత్ర పరిశీలనలో పాలెం శాస్త్రవేత్తలు శ్రీరామ్, మమత, మాధురి,డా. శంకర్, అలంపూర్ డివిజన్ వ్యవసాయ అధికారి నాగార్జున, రైతులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>