కలం, ఖమ్మం బ్యూరో : ప్రజలకు అందించే వైద్య సేవల్లో ఎలాంటి అలసత్వం వహించినా సహించేది లేదని, విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. ప్రతాప్ హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం ఆయన పలు ఆరోగ్య కేంద్రాలు (Health Centres), క్షేత్రస్థాయి వైద్య శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, వైద్య సేవల తీరును నిశితంగా పరిశీలించారు.ఈ సందర్భంగా చిట్టిరామవరం కేంద్రాన్ని సందర్శించిన ఆయన, అక్కడ నిర్వహణలో ఉన్న రికార్డులను పరిశీలించడంతో పాటు, ఆ కేంద్రంపై ఇటీవల అందిన ఫిర్యాదులపై సిబ్బందిని ఆరా తీశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని, సేవలందించడంలో పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించిన ఆయన వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాలను పరిశీలించారు. పాలకొయ తండా, నవభారత్ ప్రాంతాల్లో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద చిన్నారులకు నిర్వహిస్తున్న కంటి పరీక్షలను పరిశీలించి, సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అలాగే రామవరం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలోని డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్, స్పెషల్ న్యూ బోర్న్ కేర్ యూనిట్, జీరో డోస్ వ్యాక్సినేషన్ గదులను తనిఖీ చేసి, నవజాత శిశువుల సంరక్షణపై పలు ఆదేశాలు జారీ చేశారు. ఏ చిన్నారి కూడా టీకాలకు దూరంగా ఉండకూడదని స్పష్టం చేశారు.
అనంతరం పాత కొత్తగూడెం పరిధిలోని గొల్లగూడెంలో మీజిల్స్–రుబెల్లా నిర్మూలన ప్రచార ప్రత్యేక టీకా సెషన్‌ను డా. ప్రతాప్ పర్యవేక్షించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ టీకాలు అందేలా ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కోరారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విజయవంతం చేస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించడమే వైద్య ఆరోగ్య శాఖ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటనలో వైద్యాధికారులు డా. వినోద్, నాగభూషణం, సరిత తదితరులు పాల్గొన్నారు.

