కలం, స్పోర్ట్స్ : నార్వే చెస్ టోర్నమెంట్ (Norway Chess 2026) లో ఆరో రౌండ్ మ్యాచ్‌లు మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో ముగిశాయి. పురుషుల విభాగంలో ఆడిన మూడు క్లాసికల్ గేమ్స్‌లోనూ ఒకరు గెలిచి, మరొకరు ఓడిపోవడం విశేషం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అమెరికా గ్రాండ్ మాస్టర్ వెస్లీ సో టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లారు. ఈ రౌండ్‌లో వరల్డ్ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్.. టోర్నీ లీడర్ అలీరెజా ఫిరౌజాపై అదిరిపోయే విజయం సాధించారు. తెల్ల ముక్కలతో ఆడిన కార్ల్‌సన్, మొదట్నుంచీ ఫిరౌజాపై ఒత్తిడి పెంచుతూ వచ్చారు. చివరకు ఆ ఆధిక్యాన్ని విజయంగా మార్చుకున్నారు. ఈ టోర్నీలో ఫిరౌజాకు ఇదే మొదటి క్లాసికల్ ఓటమి.
మరో బోర్డుపై వెస్లీ సో, భారత యువ సంచలనం ప్రజ్ఞానందపై గెలిచారు. చాలా సేపు సాగిన ఈ మ్యాచ్‌లో వెస్లీ సో ఎక్కడా తడబడకుండా, ఎండ్‌గేమ్‌లో దొరికిన అవకాశాలను వాడుకుని పూర్తి పాయింట్లు సాధించారు. ఈ గెలుపుతో ఆయన పట్టికలో అందరికంటే ముందుకు వెళ్లారు. అలాగే విన్సెంట్ కీమర్ ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ గుకేష్‌ను ఓడించి సంచలనం సృష్టించారు. మ్యాచ్ మొత్తం కీమర్ తన పట్టు నిలుపుకుంటూ గుకేష్‌పై విజయం నమోదు చేశారు.
ప్రస్తుతం వెస్లీ సో నార్వే చెస్‌లో లీడింగ్‌లో ఉండగా, అలీరెజా ఫిరౌజా ఆయనకు చాలా దగ్గరగా రెండో స్థానంలో ఉన్నారు. ఇక మహిళల విభాగంలో ఒక క్లాసికల్ మ్యాచ్ ఫలితం తేలగా, మిగిలిన రెండు మ్యాచ్‌లు అర్మగెడాన్ టై బ్రేకర్ ద్వారా ముగిశాయి. ప్రపంచ ఛాంపియన్ జూ వెంజున్, భారత క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్‌పై క్లాసికల్ మ్యాచ్‌లో గెలుపొందారు. సుదీర్ఘంగా సాగిన ఈ పోరులో జూ వెంజున్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటూ విజయాన్ని అందుకున్నారు. బిబిసార అసౌబయేవా, కోనేరు హంపి మధ్య జరిగిన క్లాసికల్ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఆ తర్వాత జరిగిన అర్మగెడాన్ మ్యాచ్‌లో బిబిసార గెలిచి అదనపు పాయింట్లను సొంతం చేసుకున్నారు. అటు అన్నా ముజిచుక్, జు జినర్ మ్యాచ్ కూడా మొదట డ్రా అయింది. ఆ తర్వాత అర్మగెడాన్‌లో జు జినర్ విజయం సాధించారు. ఆరో రౌండ్ ముగిసేసరికి మహిళల విభాగంలో బిబిసార అసౌబయేవా 9.5 పాయింట్లతో మళ్లీ అగ్రస్థానంలోకి వచ్చారు. దివ్య దేశ్‌ముఖ్ 8.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, జూ వెంజున్, అన్నా ముజిచుక్ 8 పాయింట్లతో మూడో స్థానాన్ని పంచుకున్నారు.

