కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ : టీఆర్‌ఎస్ చీఫ్ కవిత

​కలం, ఖమ్మం బ్యూరో : సింగరేణి కార్మికుల హక్కుల రక్షణ కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమని, సంస్థను కాపాడుకోవడానికి కలబడి కొట్లాడుతామని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత (TRS Chief Kavitha) స్పష్టం చేశారు. సత్తుపల్లిలోని జేవీఆర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ (JVR OCP) సందర్శనకు వచ్చిన కవితను, హెచ్ఎంఎస్, టీఆర్‌ఎస్ నాయకులను సింగరేణి యాజమాన్యం పోలీసులను అడ్డుపెట్టుకుని ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అయినప్పటికీ, అధికారుల నిర్బంధాలను, ఆంక్షలను ఎదుర్కొంటూ కవిత జేవీఆర్ ఓసీపీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా గేట్ల వద్ద పోలీసులను కాపలా పెట్టడంపై, కార్మికులను కలవకుండా అడ్డుకోవడంపై సింగరేణి యాజమాన్యంతో పాటు అధికార కాంగ్రెస్ అనుబంధ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

​ప్రభుత్వానికి లొంగిపోయిన కమ్యూనిస్టులు

​కార్మిక హక్కుల కోసం పోరాడాల్సిన కమ్యూనిస్టులు, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నేతలు పూర్తిగా ప్రభుత్వానికి లొంగిపోయి, కుక్కిన పేనులా పడి ఉన్నారని కవిత దుయ్యబట్టారు. తాము వచ్చే ముందే కార్మికులతో మాట్లాడకుండా వారిని లోపలికి పంపించేశారని, మమ్మల్ని అడ్డుకోవడానికి చూపించిన టాలెంట్‌ను కార్మికుల హక్కులను, ఈసీ ఆపరేటర్ల ప్రమోషన్లను కాపాడేందుకు, ఓపెన్ కాస్ట్‌లో దుమ్ములోనే భోజనం చేయాలంటున్న మేనేజర్లపై చూపించాలని హితవు పలికారు. ఎంతో మంది త్యాగాల వల్ల వచ్చిన ఎర్రజెండాను కప్పుకుని, కార్మికులను మోసం చేస్తూ ప్రభుత్వంతో కుమ్మక్కైనందుకు సిగ్గుపడాలని, ఏదైనా బాయి ఉంటే దూకి చావండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మమ్మల్ని భౌతికంగా అడ్డుకున్నా, సోషల్ మీడియా ద్వారా కార్మికులకు సందేశాన్ని చేరవేస్తామని ఆమె హెచ్చరించారు. వేల కోట్ల రూపాయల ఆస్తులున్న సింగరేణి సంస్థ పరిధిలో కార్మికుల పిల్లల కోసం సరైన స్కూళ్లు, హాస్పిటళ్లు లేకపోవడం శోచనీయమని, సత్తుపల్లిలో కనీసం రెండు బెడ్ల హాస్పిటల్ అయినా ఉందా అని ప్రశ్నించారు. కమ్యూనిటీ హాళ్లు లేవని, వాటర్ ట్యాంకర్లు లేవని, కార్మికులకు ఇచ్చే పనిముట్లు అన్నీ నాసిరకంగా ఉన్నాయని, కాలం చెల్లిన వాహనాన్ని వాడటం వల్లే మంటలు అంటుకుని ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.

​తెలంగాణ ప్రభుత్వం సింగరేణి సంస్థకు రూ. 54 వేల కోట్లు బాకీ ఉందని, గెలిచిన గుర్తింపు సంఘాలు ప్రభుత్వం నుంచి ఆ బకాయిలను రాబట్టేలా ఒత్తిడి తేవాలని కవిత డిమాండ్ చేశారు. తాము మెడికల్ బోర్డు పెట్టకపోతే నిరవధిక దీక్ష చేస్తామని హెచ్చరించడంతోనే, భయపడిపోయిన యూనియన్ నాయకులు ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి ఫోటో దిగి వచ్చి, జూలై 15, 18 తేదీల్లో మెడికల్ బోర్డు అంటూ లీకులు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రశ్నించే వాడు ఉంటేనే ప్రభుత్వంలో స్పందన ఉంటుందని, గత 30 నెలలుగా ఈ సోయి ఎటుపోయిందని నిలదీశారు.

రిటైర్ అయ్యే కార్మికులు డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో ఆందోళన చెందవద్దని, వారు అప్లికేషన్ పెట్టుకున్న తేదీనే ప్రామాణికంగా తీసుకునేలా టీఆర్‌ఎస్ పోరాడుతుందని హామీ ఇచ్చారు. ఇల్లందు, మణుగూరు, గుండాలలో వచ్చిన దుస్థితి సత్తుపల్లికి రాకూడదని, ఇకపై చేపట్టే ఓపెన్ కాస్ట్ మైనింగ్‌లను సింగరేణియే నిర్వహించాలి తప్ప ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టవద్దని డిమాండ్ చేశారు. వేల కోట్ల సింగరేణి కార్మికుల సొమ్ముతో నిర్మించిన కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌ను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కంపెనీకి అప్పగించి, అక్కడి 350 మంది కార్మికులను పంపించివేయడం దారుణమన్నారు.

సత్తుపల్లి నుంచి కొత్తగూడెంకు 3 వందల మంది ప్రైవేట్ బస్సులు మాట్లాడుకొని వెళ్తున్నారని, ఇక్కడ 9 శాతం హెచ్‌ఆర్‌ఏ రావాల్సి ఉంటే మోసపూరితంగా 2 శాతమే ఇస్తున్నారని, దీనిపై ప్రశ్నించే దమ్ము గెలిచిన సంఘాలకు లేదుని మండిపడ్డారు. ​చివరగా, సింగరేణిలోకి వచ్చే హక్కు పోలీసులకు లేదని, సంస్థకు సొంత సెక్యూరిటీ ఉందని స్పష్టం చేస్తూ, మమ్మల్ని అడ్డుకున్న అధికారులపై లేబర్ కోర్టులో చట్టపరమైన కేసులు వేస్తామని కవిత హెచ్చరించారు. పోలీసులతో తమకు ఎలాంటి పంచాయితీ లేదని, ప్రభుత్వంతోనే తమ పోరాటమని స్పష్టం చేశారు.

గేట్ల దగ్గర పోలీసులను పెట్టారంటేనే అధికార పక్షంలో భయం మొదలైందని, దీంతోనే హెచ్ఎంఎస్ గెలుపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో హెచ్ఎంఎస్ కచ్చితంగా పోటీ చేసి గెలుపు ఢంకా మోగిస్తుందని చెబుతూ, ఎన్-మైనస్ విధానం, పీహెచ్‌డీ సమస్య, అలియాస్ పేర్ల సమస్యలను పరిష్కరించుకుందామని, జీతాలు పెంచుకుందామని కార్మికులకు పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>