కలం, వెబ్ డెస్క్ : ఒంగోలు నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)లో తీవ్ర కలకలం రేగింది. ఒంగోలు YSRCP ఎస్టీ (ST) సెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్న (Peram Prasanna) నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను వెంటనే ఒంగోలులోని రిమ్స్ (RIMS) ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి ముందు పేరం ప్రసన్న ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడి పనిచేసినా తనకు న్యాయం జరగలేదంటూ ఆమె (Peram Prasanna) ఆ వీడియోలో కన్నీటిపర్యంతమయ్యారు. వైఎస్సార్ (YSR) జయంతి వేడుకల సందర్భంగా ఒంగోలులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మహిళా నేతలు పేరం ప్రసన్న, మేరీల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో మేరీ భర్త శివకృష్ణ తనపై దాడికి పాల్పడ్డాడంటూ ప్రసన్న ఒంగోలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ గొడవ మరింత ముదరడంతో, శివకృష్ణపై ప్రసన్న కుమారుడు, అతని స్నేహితులు కూడా ఎదురు దాడికి దిగినట్లు సమాచారం. పార్టీలోని ఇరు వర్గాల మధ్య జరిగిన ఈ ఘర్షణ వైఎస్సార్‌సీపీ అధిష్ఠానం దృష్టికి వెళ్ళింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు మాజీ మంత్రి మేరుగు నాగార్జున అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ ఒక త్రిసభ్య కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ విచారణ జరుపుతున్న తరుణంలోనే పేరం ప్రసన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా, రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది.

