కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలను తమ ప్రభుత్వం రాగానే గౌరవించుకుంటామని టీఆర్‌ఎస్ చీఫ్ కవిత (TRS chief Kavitha) స్పష్టం చేశారు. ప్రతి అమరవీరుల కుటుంబానికి ఒక కోటి రూపాయల ఆర్థిక పరిహారం అందజేయడంతో పాటు, వారి సంక్షేమాన్ని పూర్తి బాధ్యతగా తీసుకుంటామని ఆమె భరోసా ఇచ్చారు.
రానున్న ఎన్నికలపై స్పందిస్తూ, త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ క్రమంలో మూడు రాజకీయ పార్టీలపై పోరాడాల్సి ఉంటుందని, ఇందుకోసం జాగృతి సైనికులు సమరోత్సాహంతో సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెబుతూ, ఆడబిడ్డల రక్షణే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతామని కవిత తెలిపారు. మహిళలను కేవలం గృహిణులుగా కాకుండా విజయవంతమైన వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ధర్మం వైపు నిలబడటమే తమ సిద్ధాంతమని, అధర్మం వైపు ఉన్నవారు సొంతవారైనా సరే వెనకడుగు వేయకుండా యుద్ధం చేస్తామని ఆమె పేర్కొన్నారు.

