కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనీ మణుగూరు (Manuguru) పట్టణంలో పాట కొట్టు (Paata Kottu) పేరుతో కూరగాయల వ్యాపారులు సామాన్య ప్రజలను దోచుకుంటున్నారు. పాట కొట్టు పేరుతో ఒక షాపు మాత్రమే తెరిచి, మిగతా షాపులను మూసి ఉంచుతారు. తెరిచిన కూరగాయల దుకాణంలో రేట్లు ఇష్టారాజ్యంగా పెంచుతున్నారు. కొనుగోలుదారులకి వేరే గత్యంతరం లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఎక్కువ రేటు పెట్టి కొంటున్నారు.
సంక్రాంతి మూడు రోజుల పండగను వ్యాపారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఒక పక్క నాన్ వెజ్(Non Veg) ధరలు చుక్కలు తాకుతుండగా పాట కొట్టు పేరుతో కూరగాయల రేట్లు కూడా ఆకాశం అంటుతున్నాయి. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో టమాట కేజీ 20 రూపాయలు పలుకుతుండగా మణుగూరులో మాత్రం అరకేజీ 30 రూపాయలకు అమ్ముతున్నారు.
పాట కొట్టు పేరుతో జరుగుతున్న దోపిడీపై గతంలో అధికారులకు ఫిర్యాదు చేయగా కొన్ని రోజులు నియంత్రణ కనిపించి మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చేదని పట్టణ వాసులు చెబుతున్నారు. అధికారులు కఠిన చర్యలు చేపట్టకపోవడం వల్లనే ఇలా జరుగుతుందని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు వ్యాపారులపై నిఘా పెట్టీ ధరలను అదుపులోకి తీసుకువచ్చి పేద, మధ్యతరగతి వర్గాలకు న్యాయం చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.


