విద్యారంగంలో రాజకీయ టోకెనిజం నశించాలి: పీపుల్స్ ఫ్రంట్

కలం, కరీంనగర్ బ్యూరో: ఎన్నికల ప్రచారాల కోసం షోకేస్ ప్రాజెక్టులను ప్రదర్శిస్తూ, పాఠశాల విద్యలో అవసరమైన సమూల మార్పులను విస్మరించడం రాజకీయ పార్టీల వ్యూహంగా మారిందని తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ (TPF) నాయకుడు, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మండిపడ్డారు. టీపీఎఫ్ చేపట్టిన 12 రోజుల విద్యా బస్ యాత్రలో భాగంగా కరీంనగర్‌లోని ఫిల్మ్ భవన్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకటి రెండు ప్రతిష్ఠాత్మక పాఠశాలలను నిర్మించడం వల్ల ప్రభుత్వ విద్య ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభం తొలగిపోదని, ప్రజాధనాన్ని ఎన్నికల మేనిఫెస్టోల్లో లేని ప్రాజెక్టులకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. విద్యారంగంలో రాజకీయ టోకెనిజం నశించాలన్నారు.

ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని వెలికితీసేందుకు టీపీఎఫ్ బృందం ఎల్లన్న నగర్, UPS మానుగొండ, ZPHS గట్టు దుద్దెనపల్లి పాఠశాలల్లో ‘బడినిద్ర’ చేసి, అక్కడ మౌలిక వసతుల లేమిని ఎత్తిచూపిందని తెలిపారు. విద్య, వైద్యం, సేద్యం రంగాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయని, వీటి పరిరక్షణకే టీపీఎఫ్ వేదిక ఏర్పడిందని మాజీ ఐఏఎస్ ఎం. చంపాలాల్ వివరించారు. బడుల విలువైన భూముల ఆక్రమణ వల్ల ప్రభుత్వ విద్యాసంస్థలు మూతపడే ప్రమాదం ఉందని సామాజిక కార్యకర్త చంద్రప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు.

కామన్ స్కూల్ (Common School) వ్యవస్థ ద్వారానే విద్యలో అసమానతలు తొలగిపోతాయని రిటైర్డ్ ఉపాధ్యాయుడు రాజమల్లు పేర్కొనగా, ఉపాధ్యాయులు విద్యా వ్యవస్థ మార్పులో భాగస్వాములు కావాలని డా. ధర్మేంద్ర నదిమెంట్ల పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ముప్పూరి కుమారన్న అధ్యక్షత వహించగా, టీపీఎఫ్ కోర్ కమిటీ సభ్యులు ప్రొఫెసర్ పద్మజా షా, ఎన్. రుబీనా, సృజన యాదవ్, నిఖిల్ విజయ కృష్ణ, పాలకూరి అశోక్ కుమార్, సమన్వయకర్త మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>