కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో అటవీ భూముల పరిరక్షణ విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అటవీ భూములకు రెవెన్యూ అధికారులు పట్టాలు (Forest Land Pattas) ఇవ్వడం సరికాదని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎంత ఒత్తిడి తెచ్చినా అటవీ భూములకు పట్టాలు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. అటవీ భూములపై రెవెన్యూ అధికారులకు ఎలాంటి హక్కులు లేవని వ్యాఖ్యానించింది.
అడవులు పర్యావరణానికి ప్రాణవాయువునిచ్చే ఊపిరితిత్తుల వంటివని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తెలిపింది. అటవీ భూముల విషయంలో రెవెన్యూ శాఖ అనవసరంగా జోక్యం చేసుకోవడం అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అటవీ అధికారులను సంప్రదించిన తర్వాతే అటవీ భూములకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ డివిజన్లోని అటవీ భూములకు సంబంధించిన వ్యవహారంపై జిల్లా కలెక్టర్ మధ్యాహ్నం 2.15 గంటలకు ఆన్లైన్ ద్వారా విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. జిల్లా అటవీ అధికారి (DFO)తో కలెక్టర్ సరైన సమన్వయంతో ఎందుకు చర్చలు జరపడం లేదో పూర్తి వివరాలతో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అటవీ భూముల పరిరక్షణ విషయంలో అధికారులు చట్ట నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పులను తప్పనిసరిగా పాటించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి అటవీ భూముల పరిరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు.
అటవీ భూములు అడవులకే చెందాలని, వాటిని ఇతర అవసరాలకు మళ్లించడం, ఆక్రమణలకు అవకాశం కల్పించడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే రెవెన్యూ అధికారులు అటవీ భూముల్లో జారీ చేసిన పట్టాల విషయంలోనూ న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని ధర్మాసనం తేల్చి చెప్పింది.

