వైరా మాజీ ఎమ్మెల్యే కుమారుడు జీవన్ లాల్‌‌కి CBI షాక్

కలం, ఖమ్మం బ్యూరో: ​వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ కుమారుడు, మాజీ ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారి జీవన్ లాల్‌తో (Jeevan Lal) పాటు ఆయన భార్య షిఫ్రా శ్రీవాస్తవకు సీబీఐ గట్టి షాక్ ఇచ్చింది. 2025లో ఒక ప్రముఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ నుంచి రూ. 70 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన కేసే ఇప్పుడు వీరి కొంప ముంచినట్లయింది. హైదరాబాద్ ఐటీ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో అప్పీల్ తీర్పులో అనుకూలంగా వ్యవహరించేందుకు జీవన్ లాల్ లంచం తీసుకుంటూ సీబీఐకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. ఆ సమయంలో నిర్వహించిన దాడుల్లో రూ. 69 లక్షల నగదుతో పాటు ముంబైలోని రూ. 2.5 కోట్ల విలువైన బెనామీ ఫ్లాట్, ఢిల్లీలోని ఆయన భార్య నివాసంలో రూ. 54 లక్షల నగదు, ఆస్తి వివరాల డైరీలను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

​లంచం కేసు విచారణ ముమ్మరంగా సాగుతుండగానే, ఆయన ఆర్థిక మూలాలపై లోతుగా దృష్టి సారించిన సీబీఐకి మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలను వెలుగులోకి తెచ్చాయి. 2022 ఏప్రిల్ 1 నుంచి 2025 మే 10 మధ్య కాలంలో ఈ కుటుంబ అధికారిక రాబడి రూ. 1.95 కోట్లుగా ఉండగా, వారి ఆస్తులు రూ. 3.07 కోట్లకు పైగా ఉన్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. తమ సర్వీస్ కాలంలో హోదాను అడ్డుపెట్టుకుని సంపాదన కంటే రూ. 1,11,77,889 అదనంగా, అంటే 57.10 శాతం మేర అక్రమాస్తులు కూడబెట్టినట్లు తేలడంతో సీబీఐ కొత్తగా ఆదాయానికి మించిన ఆస్తుల (డీసీఏ) కేసు నమోదు చేసింది.

​ఉన్నత పదవుల్లో ఉంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఈ వ్యవహారంలో జీవన్ లాల్‌కు ఆయన భార్య షిఫ్రా శ్రీవాస్తవ కూడా పూర్తిస్థాయిలో సహకరించినట్లు సీబీఐ ప్రాథమిక విచారణలో ఆధారాలు లభ్యమయ్యాయి. దీంతో ఆమెపై కూడా అవినీతి నిరోధక చట్టం కింద ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. గతంలోనూ ఆరోపణలు ఎదుర్కొన్న ఈ దంపతులపై ఇప్పుడు సీబీఐ చట్టపరమైన చర్యలు కఠినతరం చేయడంతో వారిద్దరూ తీవ్ర చిక్కుల్లో పడ్డారు. సీబీఐ అధికారులు ప్రస్తుతం తదుపరి సోదాలు, విచారణను మరింత వేగవంతం చేశారు. తీగ లాగితే డొంక కదిలినట్టుగా.. ఓ లంచం కేసు వీరి మెడకు గట్టిగా చుట్టుకుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>