కలం, వెబ్ డెస్క్: ఏపీలో సంచలనం కలిగించిన గాదె సాయికృష్ణ (Gade Sai Krishna) లాకప్ డెత్ కేసులో సిట్ కీలక ప్రకటన చేసింది. సాయికృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజు, కానిస్టేబుళ్లు కలిసి దహనం చేశారని పేర్కొంది. స్టేషన్లో సీఐ, కానిస్టేబుళ్లు కొట్టిన దెబ్బలకు సాయికృష్ణ మరణించాడని.. అనంతరం ఆనవాళ్లు దొరకవద్దనే ఉద్దేశంతో దహనం చేశారని వివరించింది. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న సురేశ్ గురువారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేయడంలో ఈయన కూడా కీలక పాత్ర పోషించినట్లు ఇప్పటికే సిట్ గుర్తించింది. సీఐ నాగరాజుకు అత్యంత సన్నిహితుడైన సురేశ్.. కేసు నమోదు కాగానే పరారీలో ఉన్నాడు. ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోవడంతో.. కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం. ఇప్పటివరకు సాయికృష్ణ డెడ్ బాడీ ఏమైపోయిందనేది మిస్టరీగానే ఉండిపోగా.. సిట్ తాజా ప్రకటనతో ఊహించిందే నిజమైంది.
అసలేం జరిగిందంటే..
విజయవాడలోని కృష్ణలంక రాజీవ్‌నగర్‌కు చెందిన గాదె సాయికృష్ణ రౌడీ షీటర్‌గా పేరొందాడు. అతడిపై పలు పోలీస్ స్టేషన్లలో 22 కేసులున్నాయి. వీటిలో అత్యాచారం, హత్య వంటి తీవ్రమైనవి కూడా ఉన్నాయి. స్థానికంగా అతడిని పిల్ల సాయిగా పిలుస్తుంటారు. 11 ఏళ్ల వయసు నుంచే నేరాల బాట పట్టాడు. ఈ నేపథ్యంలో గత మే నెలలో ఓ కేసు విషయమై కృష్ణలంక పోలీసులు సాయికృష్ణను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.
అయితే, మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చలేదు. సాయికృష్ణ ఏమైపోయాడో ఎవరికీ తెలియలేదు. దీనిపై అతడి తల్లి హై కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో కేసు గురించి చర్చ ప్రారంభమైంది. చివరికి ఎన్నో మలుపులు తిరిగిన అనంతరం.. సాయికృష్ణను సీఐ నాగరాజు, కొందరు కానిస్టేబుళ్లు లాకప్ డెత్ చేసినట్లు సిట్ నిర్ధారించింది. అయితే అతడి మృతదేహాన్ని ఏం చేశారనేది మాత్రం ఇప్పటివరకు చెప్పలేదు. దహనం చేసినట్లు తాజాగా సిట్ కీలక ప్రకటన చేసింది.

