కలం, భువనగిరి : బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అధికార దుర్వినియోగానికి పాల్పడి సిద్ధిపేట ప్రాంతంలో భూ అక్రమాలకు పాల్పడ్డారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) ఆరోపించారు. ఈ వ్యవహారాలకు సంబంధించిన వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి శుక్రవారం సిద్ధిపేట నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్ధిపేట నియోజకవర్గంలోని సర్వే నంబర్ 271లో దాదాపు 300 ఎకరాల లావణీ పట్టా భూములు ఉన్నాయని చామల తెలిపారు. 1995లో ఇదే సర్వే నంబర్లో మాజీ సైనికుడికి 4 ఎకరాల 8 గుంటలు, స్వాతంత్ర సమరయోధుడికి 2 ఎకరాల 8 గుంటల భూమిని కేటాయించారని పేర్కొన్నారు. ఈ భూములపై కొనుగోలు, అమ్మకాల లావాదేవీలు జరగకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ, 2009-10 సమయంలో హరీశ్ రావు తన మామ హనుమంతరావు పేరుతో భూమిని కొనుగోలు చేశారని ఆరోపించారు.
ఈ భూమికి ఎన్ఓసీ ఇచ్చే అధికారం జిల్లా కలెక్టర్‌కు మాత్రమే ఉన్నప్పటికీ, నిబంధనలను పక్కనపెట్టి ఆర్డీఓ నుంచి ఎన్ఓసీ పొందారని చామల ఆరోపించారు. రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న 6 ఎకరాల 18 గుంటల భూమిని హనుమంతరావు పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని పేర్కొన్నారు. కొండపాక మండలం వెలికట్ట గ్రామంలోని అసైన్డ్ భూముల విషయంలోనూ నిబంధనలకు విరుద్ధంగా బదలాయింపులు జరిగాయా అనే అంశంపై కాంగ్రెస్ బృందం రికార్డులను పరిశీలించింది. రంగనాయకసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన భూములపైనా చామల పలు ఆరోపణలు చేశారు. ప్రాజెక్టు కోసం తొలుత 2,212 ఎకరాలు సేకరించాలని నిర్ణయించినప్పటికీ, చివరకు 2,183 ఎకరాలు మాత్రమే తీసుకుని 30 ఎకరాలను పక్కన పెట్టారని తెలిపారు. ఆ 30 ఎకరాల్లో 13 ఎకరాల 20 గుంటల భూమిని 2018లో హరీశ్ రావు ఎకరాకు రూ.2 లక్షల చొప్పున కొనుగోలు చేసి ఫామ్‌హౌస్ నిర్మించుకున్నారని ఆరోపించారు.
హరీశ్ రావు కొనుగోలు చేసిన భూమి చుట్టూ సూడా పార్కును ఏర్పాటు చేశారని, ఎలాంటి టెండర్లు లేకుండానే నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో రూ.5.30 కోట్ల ప్రజాధనంతో ఫామ్‌హౌస్‌కు బ్లాక్‌టాప్ రోడ్డు నిర్మించారని చామల ఆరోపించారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూమి బదలాయింపు, సూడా ప్రమేయంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. బీఆర్ఎస్ హయాంలో జరిగినట్లు ఆరోపిస్తున్న భూ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలన్నదే తమ క్షేత్రస్థాయి పర్యటన ఉద్దేశమని చామల తెలిపారు. ఆరోపణలకు సంబంధించిన పూర్తి ఆధారాలను పరిశీలించి, బాధ్యులపై చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. కాగా, కాంగ్రెస్ నేతల సిద్ధిపేట పర్యటనపై హరీశ్ రావు స్పందిస్తూ.. తన ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లలో వెల్లడించానని తెలిపారు. తన భూములను పరిశీలించేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలకు తానే స్వయంగా వివరాలు చూపించేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.

