కలం, నిర్మల్ : గోదావరి పుష్కరాల (Godavari Pushkaralu) పనులన్నీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్(Nirmal Collector) భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం బాసర ఈవో కార్యాలయంలో గోదావరి పుష్కరాల పనులపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాసరలో పుష్కరాలకు వచ్చే భక్తుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. సాధారణ భక్తులతో పాటు వీఐపీ, వీవీఐపీ భక్తులకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పుష్కరాల నిర్వహణ, భక్తుల రద్దీ నియంత్రణ, భక్తుల సంఖ్య లెక్కింపు వంటి అంశాల్లో కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని తెలిపారు.
పుష్కరాల కోసం చేపడుతున్న పనులను సంబంధిత ఇంజనీరింగ్ శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, పనులన్నీ నాణ్యతతో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తగిన రవాణా సౌకర్యాలు కల్పించాలని, పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం తగినన్ని మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీటి వసతి కల్పించాలని చెప్పారు. పుష్కరాల సందర్భంగా హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.అనంతరం పుష్కరాల కోసం బాసరలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సమావేశంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, విద్యుత్ శాఖ ఎస్ఈ రమేష్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, నీటిపారుదల శాఖల ఈఈలు సుభాష్, సందీప్, అనిల్, ఆలయ ఈవో అంజనా దేవి, తహసీల్దార్ పవన్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

