హైకోర్టు తీర్పుపై స్పందించిన టీపీసీసీ చీఫ్.. ఏమన్నారంటే?

కలం, వెబ్ డెస్క్ : హైకోర్టు వెల్లడించిన తీర్పు బీఆర్‌ఎస్ నాయకత్వానికి చెంపపెట్టులాంటిదని, కాంగ్రెస్ పార్టీకి ఇది శ్రీరామరక్షగా నిలుస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్ (Mahesh Kumar Goud) పేర్కొన్నారు. మీడియా చిట్ చాట్‌లో మాట్లాడిన ఆయన, న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పును పూర్తిగా స్వాగతిస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో తెలంగాణలో ఎప్పుడు ఉపఎన్నికలు, సాధారణ ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు.

అభ్యర్థుల ఎంపికపై అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందని, అలాగే కేబినెట్‌లో మంత్రి పదవుల కేటాయింపు అనేది పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిధిలోని అంశమని మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గతంలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులను విచ్చలవిడిగా ప్రోత్సహించిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను కూడా లేకుండా చేసేందుకు బీఆర్‌ఎస్ కుట్రలు చేసిందని ఆరోపించారు.

అప్పటి పాలకులు ప్రతిపక్ష నేతగా ఉన్న దళిత నాయకుడు భట్టి విక్రమార్కను తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బీఆర్‌ఎస్ నేతలు ప్రగల్భాలు పలికారాని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని మండిపడ్డారు. గతంలో సబితా ఇంద్రారెడ్డి వంటి నేతలను కాంగ్రెస్ నుంచి తీసుకెళ్లి నేరుగా మంత్రి పదవులు కట్టబెట్టిన సంగతి బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు మరచిపోయారా అని ప్రశ్నించారు. 2014, 2018 ఎన్నికల తర్వాత కేసీఆర్ హయాంలో అనేక ప్రజాస్వామ్య నిబంధనలను ఉల్లంఘించారని ధ్వజమెత్తారు.

అంతేకాకుండా, కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా టీఎంసీ, శివసేన, ఎన్సీపీ వంటి ప్రాంతీయ పార్టీలను చీల్చి ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేసిందని మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. నాడు పాత బీజేపీ నేతలకు ఉన్న రాజకీయ విలువలు, నైతికత నేటి నాయకులలో ఏమాత్రం కనిపించడం లేదని ఆయన విమర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>