కలం, మెదక్ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ భూములను ఆక్రమించారంటూ వెంకటాపూర్ గ్రామస్తులు సంచలన ఆరోపణలు చేశారు. దీంతో కేసీఆర్ ఫామ్‌హౌస్ (KCR Farmhouse) వివాదం కొత్త మలుపు తిరిగింది. మర్కూక్ మండలం శివారు వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతులు, గ్రామస్తులు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక విషయాలను బయటపెట్టారు. కేసీఆర్ తమ ప్రాంతానికి వచ్చిన తర్వాతే తమ భూముల స్వరూపాన్ని, రికార్డులను పూర్తిగా మార్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
నక్షాల మార్పిడి.. ప్రభుత్వ భూముల ఆక్రమణ?
తమ గ్రామానికి చెందిన పలు సర్వే నంబర్ల నక్షాలను, రికార్డులను మార్చేసి, వాటిని సర్వే నంబర్ 325 కిందకు కలిపేశారని గ్రామస్తులు ఆరోపించారు. తమ తాతల ముత్తాతల కాలం నాటి నుంచి ఉన్న నక్షాలను, సర్వే నంబర్లను అక్రమంగా మార్చి కేసీఆర్ తమను ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. మొత్తం వెంకటాపూర్ గ్రామానికి చెందిన భూములను కొల్లగొట్టి ఎర్రవల్లి సర్వే నంబర్లలో జమ కట్టారని గ్రామస్తులు పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వ రీసర్వేపై నమ్మకం
ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న రీసర్వేతో తమకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని వెంకటాపూర్ గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సర్వే ద్వారా తమ భూములు తమకు దక్కుతాయని ఈ సందర్భంగా తెలిపారు.
ఆరోపణల్లో ఉన్న సర్వే నంబర్లు, భూముల వివరాలు
- సర్వే నంబర్ 41: 27 ఎకరాల 23 గుంటలు
- సర్వే నంబర్ 85: 73 ఎకరాల 12 గుంటలు
- సర్వే నంబర్ 88: 6 ఎకరాల 28 గుంటలు
- సర్వే నంబర్ 89: 9 ఎకరాల భూమి
- సర్వే నంబర్ 100: 2 ఎకరాల భూమి
- వీటితో పాటు 101, 162 సర్వే నంబర్లు కూడా ప్రభుత్వ భూములేనని, వాటిని కూడా ఆక్రమించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

