కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా వాటిల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అనుబంధ ట్రేడ్ యూనియన్ల గెలుపూ తథ్యమన్నారు. జలమండలి ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీ తరఫున గెలిచిన రాజిరెడ్డిని, రాజేందర్‌ను, విజేతలను గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో అభినందించిన సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో జలమండలి, ఆర్టీసీ లాంటి సంస్థలన్నీ ఆ పార్టీ గుప్పిట్లో ఉన్నాయని, ఎన్నికలే జరపకుండా నియంతృత్వం అమలైందని, ఇప్పుడు స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.
జలమండలి ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీ జెండా ఎగిరిందని, ఇకపై జరగనున్న జీహెచ్‌ఎంసీ (GHMC) ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. కార్మికులు, ఉద్యోగుల మద్దతు కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉందని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. ఐఎన్‌టీయూసీ విజయంతో ఉద్యోగుల అండ కాంగ్రెస్‌కు ఉందనే విషయం మరోసారి రుజువైందన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ప్రభుత్వం స్పందించలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సమ్మె జరిగితే సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాయకత్వంలో మూడు రోజుల్లోనే కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి సమ్మె విరమణ జరిగిందన్నారు.
గతంలో సింగరేణి, జలమండలి వంటి సంస్థలను గుప్పిట్లో పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు కార్మికులను ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. జలమండలిని హరీశ్‌రావు (Harish Rao) తన గుప్పిట్లో పెట్టుకున్నారని, ఇప్పుడు కార్మికులు స్వేచ్ఛగా ఓటు వేసి ఐఎన్‌టీయూసీ నాయకులను గెలిపించుకున్నారని మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. కార్మికుల కష్టసుఖాల్లో అండగా నిలవాలని మొగుళ్ల రాజిరెడ్డి బృందానికి సూచించారు. కార్మికుల సమస్యలు ఏవైనా సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విజయం కార్మికుల ఆత్మగౌరవానికి, కాంగ్రెస్‌పై ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. రానున్న రోజుల్లో కార్మిక సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరింత చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.
Read Also: కవిత, హరీశ్ రావులపై ఆది శ్రీనివాస్ తీవ్ర విమర్శలు
Follow Us On: Instagram

