Mobile Popup Ad
Mobile Popup Ad

ఫీజు రీయింబర్స్‌మెంట్ పై బీజేపీ పోరుబాట

కలం, తెలంగాణ బ్యూరో: భారతీయ జనతా పార్టీ (BJP)  రాష్ట్రవ్యాప్తంగా మరో పోరాటానికి సిద్ధమైంది. ‘రైతు గోస – బీజేపీ భరోసా’ పేరుతో ఇటీవల చేసిన ధర్నాలకు రైతుల నుంచి మద్దతు లభించిందని భావించిన ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలపై నిరసనలు చేయడానికి ప్లాన్ సిద్ధం చేసింది. ఈ నెల సెకండ్ వీక్ తర్వాత విద్యా సంవత్సరం ప్రారంభమవుతుండడంతో ఈ నిరసన చేపట్టాలని నిర్ణయించింది. ప్రధాని మోదీ పాలనకు 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జూన్ నెల మొత్తం వివిధ అంశాలపై చర్చా కార్యక్రమాలకు బీజేపీ రెడీ అయింది. ఈ అంశాలపై టీవీ ఛానెళ్ళలో డిబేట్స్, ఇతర వేదికలపై మాట్లాడేలా నేతలకు బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు దిశానిర్దేశం చేశారు. తొలుత గోదావరి, కృష్ణా నదీ జలాలు, ప్రాజెక్టులు, నీటి పారుదల రంగంపై సమావేశమై చర్చించారు. రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, మీడియా ప్యానలిస్టులు ఇందులో పాల్గొన్నారు. ఆ తర్వాత సమావేశం బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ అభయ్ పాటిల్, సంస్థాగత ఇన్‌ఛార్జ్ చంద్రశేఖర్ తివారి, పదాధికారులతో జరిగిన సమావేశంలో విద్యార్థులకు అండగా నిలిచేందుకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పోరుబాటకు యాక్షన్ ప్లాన్ ఖరారు చేసింది.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేలా ఒత్తిడి తెచ్చే యాక్షన్ ప్లాన్‌పై ప్రధాన చర్చ జరిగింది. ‘రైతు గోస-బీజేపీ భరోసా’ పోరుబాటతో ప్రభుత్వం దిగివచ్చిందనే అంచనాకు వచ్చిన బీజేసీ రాష్ట్ర నాయకత్వం ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారనే అభిప్రాయానికి వచ్చింది. దీనిపై రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యలపైనా గట్టిగా పోరాడాలనే నిర్ణయం తీసుకున్నామన్నారు. కిషన్‌రెడ్డిని ఉద్దేశిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను రాంచందర్‌రావు తప్పుపట్టారు. కిషన్‌రెడ్డిని అడ్డుకుంటామనే వ్యాఖ్యలు వ్యక్తిగత విమర్శలేనని, ఇలాంటివాటిని మానుకోవాలని హెచ్చరించారు. కిషన్‌రెడ్డిని పొలిమేర దాటనివ్వమంటూ సీఎం వ్యాఖ్యలు చేయడానికి హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. బీజేపీ తలుచుకుంటే కాంగ్రెస్ లీడర్లను ఊరు దాటనివ్వరని, ప్రతీ చోటా అడ్డుకుంటారని అన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే పార్టీ శక్తి ఏంటో చూపిస్తామన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>