కలం, వెబ్ డెస్క్: పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విస్తృత స్థాయి పర్యటన కొనసాగుతుంది. పెద్దపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో పాల్గొని ప్రసంగించిన అనంతరం సింగరేణి పరిరక్షణ సదస్సులో పాల్గొనేందుకు హరీశ్ రావు రామగుండం చేరుకున్నారు. గోదావరిఖని సీఎస్‌పీలో సింగరేణి (Singareni) కార్మికులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే రామగుండంలోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ లో బొగ్గు నిల్వలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు హరీశ్ రావు, బీఆర్ఎస్ బృందం అక్కడికి వెళ్ళింది. హరీశ్ రావు పర్యటన నేపథ్యంలో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సీహెచ్‌పీలోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించగా.. హరీశ్ రావును, బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసు అధికారుల తీరుతో అక్కడే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. తమను లోపలికి వెళ్లేందుకు అనుమతినివ్వాలని డిమాండ్ చేశారు. పోలీసుల తీరుపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేటికీ 30 శాతం వడ్లు కల్లాల్లోనే..
అంతకముందు పెద్దపల్లి పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఆత్మీయ సమావేశంలో హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రెండున్నరేళ్ల రేవంత్ రెడ్డి పాలన చూసిన తర్వాత, కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ (KCR) రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ 100 సీట్లు సాధించడం ఖాయమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని, 30 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆపి వారి భవిష్యత్తును రేవంత్ రెడ్డి ఆగం చేశారని ఫైర్ అయ్యారు. వడ్లు అమ్ముకోవడానికి రైతులు 45 రోజుల పాటు కల్లాల వద్ద పడిగాపులు కాశారని, నేటికీ 30 శాతం వడ్లు కల్లాల్లోనే ఉన్నాయని, ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో పూర్తిగా విఫలమైందని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం యాసంగి పంటకు రైతుబంధు ఎగనామం పెట్టిందని హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు.
సగం కూడా రుణమాఫీ చేయలేదు..
దేవుళ్ల మీద ఒట్లు పెట్టి ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానన్న రేవంత్ రెడ్డి (CM Revanth), బడ్జెట్‌లో చెప్పిన రూ. 35 వేల కోట్లకు గానూ సగం కూడా రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో మండలానికో గోదాము కట్టి ఎరువుల కొరత లేకుండా చేస్తే, నేడు కాంగ్రెస్ పాలనలో ఎరువుల కోసం మళ్లీ పాత రోజుల తరహాలో క్యూలైన్లు, లాఠీఛార్జీల పరిస్థితి దాపురించిందని విమర్శించారు. గత నాలుగు నెలలుగా ఎల్ఐసీకి ప్రీమియం కట్టకపోవడం వల్ల రాష్ట్రంలో 3 వేల మంది రైతులు చనిపోయినా రైతు బీమా రాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం కొత్తగా తెస్తున్న ‘రైతు డిస్కం’ జీవో నంబర్ 8 వల్ల వ్యవసాయానికి కేవలం పగటి పూట 7 నుంచి 8 గంటల పాటు మాత్రమే కరెంటు వస్తుందని, కేసీఆర్ ఇచ్చిన 24 గంటల ఉచిత కరెంటుకు ఉరి వేయబోతున్నారనిఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాలనలో పెద్దపల్లి జిల్లాలో ఎకరం భూమి 50 నుంచి 60 లక్షలు ఉంటే.. నేడు కాంగ్రెస్ పాలనలో సగానికి పడిపోయిందని చెప్పారు. రైతుతో పాటు రైతుల భూముల విలువ కూడా తగ్గిపోయిందన్నారు.
Read Also: దేశాన్ని విభజించొద్దు.. రేవంత్‌కు కేంద్ర మంత్రి కౌంటర్
Follow Us On: X(Twitter)

