కలం, వెబ్ డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఆదివారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అంకురార్పణంతో ఉత్సవాలు మొదలవుతాయి. అక్టోబరు 12 నుంచి 20వ తేదీ వరకు వైభవోపేతంగా ఉత్సవాలు జరుగనున్నాయి. అధికమాసం వచ్చిన సంవత్సరాల్లో తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలతో పాటు దసరా నవరాత్రుల్లో ప్రత్యేకంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది అధికమాసం కావడంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.
ఉత్సవాల్లో భాగంగా అక్టోబరు 16న గరుడ వాహనం, 17న పుష్పక విమానం, 19న స్వర్ణరథం, 20న చక్రస్నానం ప్రధాన ఘట్టాలుగా నిలవనున్నాయి. ఈ రోజుల్లో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకోనున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆదివారం నుంచి ఈ నెల 20 వరకు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేసింది.
నవరాత్రి బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ఇదే..!
అక్టోబరు 12: ఉదయం 9 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహన సేవ
అక్టోబరు 13: ఉదయం 8 గంటలకు చిన్నశేష వాహన సేవ, రాత్రి 7 గంటలకు హంస వాహన సేవ
అక్టోబరు 14: ఉదయం 8 గంటలకు సింహ వాహన సేవ, రాత్రి 7 గంటలకు ముత్యపుపందిరి వాహన సేవ
అక్టోబరు 15: ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహన సేవ, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహన సేవ
అక్టోబరు 16: ఉదయం 8 గంటలకు మోహినీ అవతార దర్శనం, సాయంత్రం 6.30 గంటలకు గరుడ వాహన సేవ
అక్టోబరు 17: ఉదయం 8 గంటలకు హనుమంత వాహన సేవ, సాయంత్రం 4 గంటలకు పుష్పక విమానంపై ఊరేగింపు, రాత్రి 7 గంటలకు గజ వాహన సేవ
అక్టోబరు 18: ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహన సేవ, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహన సేవ
అక్టోబరు 19: ఉదయం 7 గంటలకు స్వర్ణరథంపై శ్రీవారి ఊరేగింపు, రాత్రి 7 గంటలకు అశ్వ వాహన సేవ
అక్టోబరు 20: ఉదయం 6 గంటలకు చక్రస్నానం ఘట్టంతో నవరాత్రి ఉత్సవాల ముగింపు

