కలం, వెబ్ డెస్క్ : హిందువులకు అత్యంత పవిత్రమైన తిరుమల అలిపిరి మెట్ల (Tirumala Alipiri Steps)పై ఓ వ్యక్తి దర్జాగా సిగరెట్ తాగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) స్పందించింది. అలిపిరి నడకమార్గంలో ఇలాంటి ఘటన జరగడంపై సీరియస్ అయింది. సిగరెట్ తాగిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొంది.
తిరుమల నిబంధనల ప్రకారం ఆలయ ప్రాంతాల్లో ధూమపానం, మద్యపానం, మత్తుపదార్థాలు సేవించడం నిషేధం అని స్పష్టం చేసింది. నిబంధనలు అతిక్రమించి సిగరెట్ హేయమైన చర్య అని టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారితో పాటు.. ఇంత జరుగుతున్నా తనిఖీలలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కూడా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
కాగా, అలిపిరి నడక మార్గంలో ఓ వ్యక్తి సిగరెట్ తాగుతున్నాడు. తాగొద్దని భక్తులు కోరినా పట్టించుకోకుండా దర్జాగా తాగిన ఘటనకు సంబంధించి కొందరు భక్తులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో టీటీడీ స్పందించింది. అయితే, గతంలో చాలా సార్లు తిరుమలలో భద్రతా లోపం జరిగింది. తాజా ఘటనతో సిబ్బంది వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

