కలం/ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రధాన పట్టణమైన మణుగూరు మున్సిపాలిటీ పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఇక్కడ పన్నులు మాత్రం మున్సిపాలిటీ చట్టాల ప్రకారం విధిస్తున్నారు. పాలన మాత్రం పంచాయతీల మాదిరిగా నిర్వహిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాలిటీ చట్టాల ప్రకారం ఆస్తి పన్నులు భారంగా మారాయని, కానీ పాలకవర్గం లేకపోవడంతో పారిశుధ్యం పడకేసిందనీ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మణుగూరు (Manuguru Municipality), భద్రాచలం పట్టణాలను 2005 జూలై 31న మున్సిపాలిటీలుగా ప్రకటిస్తూ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో మున్సిపాలిటీలను వ్యతిరేకిస్తూ గిరిజనులు కోర్టును ఆశ్రయించారు. మున్సిపాలిటీ అంశం కోర్టులో ఉండటంతో ఎన్నికలు నిర్వహించడం లేదు. ప్రత్యేక అధికారులు పాలనే కొనసాగుతోంది. ఇటీవల భద్రాచలంను తిరిగి మేజర్ పంచాయతీగా గుర్తించి ఎన్నికలు జరిపి పాలకవర్గాన్ని ఏర్పాటు చేశారు. కానీ మణుగూరు ను మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మణుగూరు మున్సిపాలిటీలోని 20వార్డుల్లో 50వేలపైనే జనాభా ఉంటుంది. సమీపంలో ఉన్న 13 గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయడంతో వీటికి కూడా ఎన్నికలు జరగడంలేదు. వ్యవసాయ ఆధారిత గ్రామాలు పురపాలికలో విలీనం అవ్వడంతో ఉపాధి హామీ పథకం పనులు వీరికి వర్తించడంలేదు. దీంతో ఈ గ్రామాల్లోని రైతులు, వ్యవసాయ కూలీలు 20 ఏళ్లుగా పనులు లేక నష్టపోతున్న పరిస్థితి నెలకొంది.
మణుగూరు మున్సిపాలిటీ (Manuguru Municipality) పరిధిలోని గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. శాసనసభ సమావేశాల్లో సైతం ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయినా ఇంకా మణుగూరు మున్సిపాలిటీగానే కొనసాగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఈ సమస్య పరిష్కారం కావడంలేదని మున్సిపాలిటీ ప్రజల్లో ఒకింత నిరాశ నెలకొన్నది. ఇకనైనా జిల్లా మంత్రులు మణుగూరు మున్సిపాలిటీ కి ఒక పరిష్కారం చూపుతారని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


