కలం, వెబ్‌డెస్క్: విశాఖపట్నంలోని ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్‌లో జరుగుతున్న ఐజీయూ ఆంధ్రప్రదేశ్ (IGU Andhra Pradesh) జూనియర్ బాయ్స్ గోల్ఫ్ ఛాంపియన్‌షిప్ (Golf Championship) ఉత్కంఠభరితమైన ముగింపునకు సిద్ధమైంది. గురువారం జరిగిన మూడో రౌండ్ ముగిసేసరికి టాప్ ఫోర్ స్థానాల్లో ఉన్న క్రీడాకారుల మధ్య కేవలం మూడు షాట్ల తేడా మాత్రమే ఉంది. దీంతో శుక్రవారం జరగబోయే ఆఖరి రోజు ఆటలో విజేత ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అర్జున్ దహియా కేవలం ఒక్క షాట్ ఆధిక్యంతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
టోర్నీలో రెండో రోజూ లీడర్‌గా నిలిచిన అర్జున్ దహియా, మూడో రోజు ఆటలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆట మొదట్లో కొన్ని తప్పులు చేయడంతో, మొదటి రౌండ్ హీరో విహాన్ జైన్ నాలుగు షాట్ల ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. అయితే, అర్జున్ పట్టువదలకుండా పోరాడి చివరికి 213 స్కోరుతో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. విహాన్ జైన్ ఆఖరి హోల్‌లో చేసిన చిన్న పొరపాటు వల్ల రెండో స్థానానికి పరిమితమయ్యాడు. వీరిద్దరి వెంటే చైతన్య పాండే, ఇష్నీద్ విర్ది కూడా టైటిల్ వేటలో గట్టి పోటీని ఇస్తున్నారు. మిగతా విభాగాల్లోనూ పోటీ రసవత్తరంగా సాగింది.
కేటగిరీ ‘బి’ (13-14 ఏళ్లు): చైతన్య పాండే తన అద్భుత ప్రదర్శనతో ఏకంగా 13 షాట్ల ఆధిక్యాన్ని సంపాదించి అగ్రస్థానంలో నిలిచాడు. ఆదిత్య మిశ్రా రెండో స్థానంలో ఉన్నాడు.
కేటగిరీ ‘సి’ (11-12 ఏళ్లు): ఈ విభాగంలో ద్రోణ సింగ్ ధుల్ అద్భుతం చేశాడు. ఆట ముగిసేసరికి షాన్ అల్వీతో సమానంగా నిలిచిన ద్రోణ, ప్లేఆఫ్ హోల్‌లో విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. మొదటి రెండు రోజులు ఆధిక్యంలో ఉన్న షాన్ అల్వీ, చివరి రోజు వెనుకబడటంతో రన్నరప్‌గా నిలిచాడు.

