కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) తన తదుపరి భారీ ప్రాజెక్ట్ కోసం స్క్రిప్ట్ పనులను ముమ్మరం చేశాడు. విక్టరీ వెంకటేశ్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడి తన టీంతో కలిసి తుది మెరుగులు దిద్దుతున్న ఈ స్క్రిప్ట్ మే నెల కల్లా సిద్ధం కానుంది. అనంతరం జూన్‌లో ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసి, జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రంలో కథానాయికగా కీర్తి సురేష్ ఎంపికవ్వగా, మరో హీరోయిన్ కోసం అన్వేషణ సాగుతోంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
మరో విశేషమేమిటంటే.. ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం టాలీవుడ్ (Tollywood)లో మొదటిసారిగా ముగ్గురు అగ్ర నిర్మాతలు చేతులు కలిపారు. సాహు గారపాటి నేతృత్వంలోని షైన్ స్క్రీన్స్ సంస్థతో కలిసి సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తూ లాభాల్లో వాటా తీసుకోనుండగా, జీ స్టూడియోస్ భారీ పెట్టుబడి పెట్టడమే కాకుండా నాన్-థియేట్రికల్ హక్కులను దక్కించుకుంది. సాహు గారపాటి ఈ ప్రాజెక్ట్‌లో ప్రధాన వాటాదారుగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

