కలం, మెదక్ బ్యూరో: మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేస్తుందని టీజీఐఐసీ చైర్‌పర్సన్ (TGIIC Chairperson) నిర్మల రెడ్డి (Nirmala Reddy) అన్నారు. సంగారెడ్డి (Sangareddy) మున్సిపల్ కార్యాలయంలో మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీ లేని రుణాలను పూర్తిగా మహిళా సంఘాల సభ్యులకు అందించినట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమని అధికారులు, ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజల మధ్య ఉంటున్నారని అన్నారు. ఇందిరా శక్తి పథకం కింద 119 మంది మహిళలకు రుణాలను మంజూరు చేసినట్లు వివరించారు. పట్టణంలో 29 వేల మంది మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం రెండు రంగుల చీరలను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూన వనిత, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, టీఎంసీ విజయభారతి, కౌన్సిలర్లు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

