కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఐసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు (TG ICET Results – 2026) నేడు విడుదల కానున్నాయి. జూన్ 12వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్‌లోని టీజీసీహెచ్ఈ (TGCHE) కార్యాలయ కమిటీ హాల్‌లో ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డి, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్, టీజీ ఐసెట్ 2026 (TG ICET – 2026) ఛైర్మన్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్‌లతో పాటు పలువురు విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఫలితాలను, అలాగే ఫలితాల విశ్లేషణను విడుదల చేయనున్నారు.
నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఈ ప్రవేశ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఫలితాల ప్రకటన అనంతరం విద్యార్థులు తమ మార్కులు, ర్యాంకులను తెలుసుకోవడానికి ఆన్‌లైన్ లింక్ అందుబాటులోకి వస్తుంది. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబరును నిర్దేశిత బాక్సులో నమోదు చేయడం ద్వారా ఫలితాలను పొందవచ్చు. ఈ ఆన్‌లైన్ ఫోల్డర్‌లో అభ్యర్థి పేరు, హాల్ టికెట్ నంబర్, సెక్షన్ల వారీగా సాధించిన నార్మలైజ్డ్ మార్కులు, మొత్తం మార్కులు, అర్హత సాధించారా లేదా అనే పూర్తి వివరాలు పొందుపరచబడతాయి. అభ్యర్థులు తమ ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ icet.tgche.ac.in ను సందర్శించవచ్చు.

