కలం, వెబ్ డెస్క్: నేడు ఏపీలోని తిరుపతి నగరంలో కూటమి ప్రభుత్వం భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. తిరుపతిలోని దామినేడులో ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి సంక్షేమం’ పేరుతో సభ జరుగనుంది. ఈ బహిరంగ సభకు సీఎం చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మంత్రి లోకేశ్, కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. సభలో పాల్గొనేందుకు ఉదయం 10.40 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు సీఎం చేరుకోనున్నారు. సభ ముగించుకున్న అనంతరం చంద్రబాబు ఉండవల్లికి బయలుదేరనున్నారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని… విదేశీ యాత్రలను వీలైనంత వరకు మానుకోవాలన్న ప్రధాని పిలుపుతో ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి మాత్రమే సభకు ప్రజలు రావాలని నాయకులు సూచించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సభ జరగనుంది.
సభలో 18 స్టాళ్లు ఏర్పాటు..
సీఎం (Chandrababu), డిప్యూటీ సీఎంతోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సభా ప్రాంగణాన్ని హోంమంత్రి అనిత, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు పరిశీలించారు. సభ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకున్నారు. సభా ప్రాంగణంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి 18 స్టాళ్లు ఏర్పాటు చేశారు.
ఎన్టీఆర్ భరోసా (NTR Bharosa) పెన్షన్లు, అన్నదాత-సుఖీభవ, పీఎం కిసాన్, స్త్రీశక్తి, దీపం-2, అన్న క్యాంటీన్లు, మీభూమి-మీహక్కు, పీ4, సంజీవని, జలధార-జలహారతి తదితర కార్యక్రమాలకు సంబంధించిన స్టాళ్లు కనువిందు చేయనున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవడంతో పాటు ప్రధానిగా మోదీ పుష్కర కాలం పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని సభ ఏర్పాటు చేశారు. విశాఖ విశాఖ స్టీల్ ప్లాంట్ భారీ పేలుడు ఘటన దృష్ట్యా ఈ నెల 9న తిరుపతిలో నిర్వహించాల్సిన సభను వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా విశాఖ, అమరావతి సభలను రద్దు చేసి కేవలం తిరుపతి సభ మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Read Also: ‘కాక్రోచ్ జనతా పార్టీ’పై కేంద్రం స్పెషల్ ఫోకస్
Follow Us On: Instagram

