కలం, వెబ్ డెస్క్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు (Ramchander Rao) మాట్లాడారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ముఖ్యమంత్రి విదేశీ పర్యటన అనుమతుల వ్యవహారంతో పాటు మెడికల్ విద్యార్థుల ఫీజుల సమస్యలపై ఆయన కీలక ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
బీజేపీలోకి ప్రముఖ వైద్యుల చేరిక:
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ క్యాన్సర్ నిపుణులు, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ పోస్ట్ గ్రాడ్యుయేట్, క్యాన్సర్ రిహాబిలిటేషన్ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ విజయేందర్ కు, అలాగే ఎల్బీ నగర్ మేఘనా హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ప్రమోద్ కు రామచందర్ రావు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్ ద్వారా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కమిటీలను నిర్మించి విశేష సేవలందిస్తున్న డాక్టర్ విజయేందర్, తోటి వైద్యులందరి మద్దతును బీజేపీకి సమీకరిస్తూ పార్టీలో చేరడం ఎంతో శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు.
సీఎం విదేశీ పర్యటన అనుమతులపై స్పష్టత:
ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వకపోవడం వెనుక ఎటువంటి రాజకీయ కోణం లేదని రామచందర్ రావు స్పష్టం చేశారు. సీఎంతో పాటు వెళ్లే అధికారుల ప్రతినిధి బృందానికి పెట్టుబడులు, ఒప్పందాల కోసం సమావేశాలు నిర్వహించుకోవడానికి ఇప్పటికే కేంద్రం అనుమతులు ఇచ్చిందని గుర్తుచేశారు. రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రులు, మంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్లే సమయంలో ఆ పర్యటన అధికారిక ఆవశ్యకత, ఆహ్వానించిన సంస్థల నేపథ్యం, హాజరయ్యే వ్యక్తుల స్థాయి, అంతర్జాతీయ ప్రోటోకాల్, డిప్లొమాటిక్ అంశాలు, భద్రతా ఏర్పాట్లు, ఎఫ్‌సీఆర్‌ఏ (FCRA) నిబంధనలు తదితర కీలక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.
గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో 2012లో నాటి అస్సాం కాంగ్రెస్ సీఎం తరుణ్ గొగొయ్ అమెరికా, ఇజ్రాయెల్ పర్యటనలను, అలాగే జార్ఖండ్ నాటి బీజేపీ సీఎం అర్జున్ ముండా థాయిలాండ్ పర్యటనను కేంద్రం తిరస్కరించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అంతేకాకుండా నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్ననరేంద్ర మోదీకి అమెరికా వీసా రాకుండా కాంగ్రెస్ ఎంపీలు, నాయకులు కుట్రపూరితంగా లేఖలు రాసిన చరిత్రను గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి గతంలో విదేశాలకు వెళ్లినప్పుడు కేంద్రం ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదని, తాజా పర్యటనకు సంబంధించిన నిబంధనలు, విధివిధానాల లోపాల ప్రకారమే నిర్ణయం జరిగిందని, దీనిని రాజకీయం చేయవద్దని హెచ్చరించారు.
ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫీజు దోపిడీపై ఆగ్రహం – రీఫండ్‌కు డిమాండ్:
నీట్ ద్వారా ప్రవేశాలు పొందిన ఎంబీబీఎస్ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుండి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అక్రమంగా ఫీజులు వసూలు చేయడంపై శ్రీ ఎన్. రాoచందర్ రావు గారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగున్నర సంవత్సరాల కోర్సు ఫీజును ఐదు వాయిదాలలో చెల్లించాలని తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (TAFRC) నిర్దేశించినప్పటికీ, కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా ఐదేళ్ల పూర్తి ఫీజును వసూలు చేస్తూ ఒక్కో విద్యార్థి కుటుంబంపై రూ.13 లక్షల నుండి రూ.20 లక్షల వరకు అదనపు భారం మోపాయని మండిపడ్డారు. విద్యార్థుల నుండి అదనంగా వసూలు చేసిన ఫీజులను వెంటనే వాపస్ చేయాలని టీఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్ జస్టిస్ గోపాల్ రెడ్డితో పాటు హైకోర్టు కూడా స్పష్టమైన తీర్పులిచ్చాయని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) తక్షణమే జోక్యం చేసుకుని ఆయా ప్రైవేట్ కళాశాలల నుంచి విద్యార్థులకు ఫీజులు రీఫండ్ అయ్యేలా కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుల పక్షాన బీజేపీ నిలబడి న్యాయం జరిగే వరకు పోరాడుతుందని తెలిపారు.

