కలం, వెబ్ డెస్క్: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రేపు (మంగళవారం) తెలంగాణలో సభ నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ, జనసేన సాధక్ సమ్మేళనం పేరుతో గచ్చిబౌలిలో ఈ సభ నిర్వహింబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వివాదం నెలకొన్నది. కొందరు తెలంగాణ వాదులు, కాంగ్రెస్ నేతలు సైతం ఈ సభ నిర్వహించడాన్ని తప్పుపడుతున్నారు. మరోవైపు ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం నేపథ్యంలో కొందరు జర్నలిస్టులు సైతం ఈ సభను అడ్డుకుంటామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాస్త టెన్షన్ వాతావరణం నెలకొన్నది.
పవన్ కీలక భేటీ
ఈ పరిస్థితుల్లో సభకు ముందు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించినట్లు సమాచారం. సభ నిర్వహణ, జనసమీకరణ, భద్రతా ఏర్పాట్లు, రాజకీయ వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ విస్తరణపై జనసేన దృష్టి సారించిన నేపథ్యంలో ఈ సభకు ప్రాధాన్యం ఏర్పడింది. రాష్ట్ర రాజకీయాలపై పవన్ కల్యాణ్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, భవిష్యత్ కార్యాచరణపై ఏవైనా సంకేతాలు ఇస్తారా అనే అంశాలపై ఆసక్తి నెలకొంది.
వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్
జనసేన సభను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తెలంగాణ ప్రజల భావోద్వేగాలకు విరుద్ధంగా కొన్ని వ్యాఖ్యలు చేసిన నాయకులకు రాష్ట్రంలో రాజకీయ వేదిక కల్పించకూడదని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. సభ నిర్వహణ వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాలపై కూడా వారు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మరోవైపు తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత సైతం జనసేన సభను వ్యతిరేకించారు. కొన్ని తెలంగాణ సంఘాలు కూడా సభపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం కలిగించే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని హెచ్చరిస్తున్నాయి. సభ నేపథ్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది.
ఈ పరిణామాల మధ్య రేపటి జనసేన సభ ప్రశాంతంగా జరుగుతుందా, లేక రాజకీయంగా ఏదైనా ఉద్రిక్తత నెలకొంటుందా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. పవన్ కల్యాణ్ ప్రసంగం తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి చర్చకు దారితీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

