కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లాలో దొంగల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆలయాలు, ఇండ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా మామడ మండలం కొరటికల్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి ప్రవేశించి హుండీని పగలగొట్టి అందులోని నగదును ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి ప్రధాన ద్వారం వద్ద హుండీ ధ్వంసమై ఉండటాన్ని గమనించి ఆలయ కమిటీ సభ్యులకు సమాచారం అందించారు.
అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఆలయానికి ఎదురుగా ఉన్న ఓ వెల్డింగ్ షాపులోని వ్యక్తి మొబైల్ ఫోన్‌ను కూడా దుండగులు అపహరించినట్లు సమాచారం. ఒకే రాత్రిలో రెండు చోట్ల చోరీలు జరగడం స్థానికుల్లో ఆందోళనకు గురిచేసింది. గత కొద్ది రోజుల క్రితం మామడ మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా చోరీ జరిగిన విషయం తెలిసిందే. వరుసగా ఆలయాలపై దొంగతనాలు జరుగుతుండటంతో పోలీసు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

