కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని గణపతి ఆలయంలో ఆదివారం అపశ్రుతి చోటు చేసుకుంది. ఆలయ ఉత్సవాల సందర్భంగా ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా.. అది ఒక్కసారిగా విరిగి భక్తులపై పడింది. ఈ ఘటనలో పలువురు భక్తులకు గాయాలయ్యాయి. గాయపడ్డవారిని వెంటనే, భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గాయపడ్డ వారిలో ఒక చిన్నారి, మహిళా ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన ఆలయ కమిటీ సభ్యులు సహాయక చర్యలు చేపట్టారు. భక్తులు అప్రమత్తంగా ఉండటంతో పెను ప్రమాదమే తప్పిందని స్థానికులు చెప్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా, ధ్వజ స్తంభం ప్రతిష్టాపన కార్యక్రమం చేపట్టిన నిర్వాహకులపై పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

