గుడిలోకి వెళ్లిన దళిత యువకుడిపై ఎమ్మెల్యే మేనమామ కులవివక్ష!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలోని వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో సంచలన ఘటన వెలుగుచూసింది. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA) తుడి మేఘారెడ్డి మేనమామ వెంకటరాంరెడ్డి, కుటుంబసమేతంగా ఆలయ దర్శనానికి వచ్చిన ఒక ఎస్సీ (మాదిగ) యువకుడి పట్ల తీవ్ర కుల వివక్ష ప్రదర్శించడం తీవ్ర కలకలం రేపింది. “మేం కట్టుకున్న గుడి లోపలికి మీరు ఎట్లా వస్తారు?” అంటూ ఆ యువకుడిని ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకుని, తీవ్ర పదజాలంతో దూషించారు. గ్రామ పంచాయతీ భూమిలో నిర్మించిన దేవాలయంలోకి దళితుడికి ప్రవేశం లేదనడంపై బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్షాలు, దళిత సంఘాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఇటీవల అసెంబ్లీ స్పీకర్‌ విషయంలో ‘దళిత సంక్షేమం’ అని మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడు స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే బంధువు చేసిన ఈ అనాగరిక చర్యపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు.

ఎమ్మెల్యే మేనమామపై కేసు నమోదు చేయాలి

గ్రామ పంచాయతీ స్థలంలో ఉన్న ఆలయంలో దేవాలయ ప్రవేశాన్ని అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని, ఎమ్మెల్యే మేఘారెడ్డి వెంటనే చొరవ తీసుకుని తన మేనమామపై పెద్దమందడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయించి అరెస్ట్ చేయించాలని బీఆర్ఎస్ శ్రేణుల నుంచి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఆధునిక సమాజంలో కూడా దళితులపై ఇటువంటి వివక్షా పూరిత ఘటనలు పునరావృతం కాకుండా, హోంశాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>