కలం, కరీంనగర్ : విద్యార్థుల్లో ప్రతిభ, సత్తా ఉంటే ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు వారినే వెతుక్కుంటూ వస్తాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు (Yadagiri Sunil Rao) పేర్కొన్నారు. నేర్చుకున్న విద్యతోనే సరిపెట్టుకోకుండా, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థులు ప్రతిరోజూ తమ ప్రతిభకు సానపెడుతూ సరికొత్త ఆవిష్కరణల (ఇన్నోవేషన్) వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
కరీంనగర్ జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నగరంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో 54వ జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన 2026-27 (Children Science Fair) శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు హాజరై ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను ఆసక్తిగా తిలకించారు.
‘సుస్థిర, వికసిత భారత్ కోసం సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణలు’ అనే ప్రధాన థీమ్‌తో నవంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు ఈ మెగా విజ్ఞాన వేడుక కొనసాగనుంది. విద్యార్థుల సృజనాత్మకతకు వేదికగా నిలుస్తున్న ఈ ప్రదర్శనలో 13వ ఇన్‌స్పైర్ అవార్డ్స్ – మానక్ జిల్లా స్థాయి ప్రదర్శన, ప్రాజెక్ట్ పోటీలు, జిల్లా స్థాయి పీఎంశ్రీ సైన్స్ ఎగ్జిబిషన్, తెలంగాణ ఫ్యూచర్ ఇన్నోవేటర్స్ ఛాలెంజ్ (TFIC 1.0), జిల్లా స్థాయి సోషల్ సైన్స్ ఎగ్జిబిషన్‌లను ఆకర్షణీయంగా నిర్వహిస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు రూపొందించిన వినూత్న నమూనాలు, సామాజిక అంశాల ప్రదర్శనలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. సైన్స్ ఫెయిర్ నిర్వహణకు శ్రీ సరస్వతి శిశు మందిర్‌ను ఎంపిక చేయడం అభినందనీయమన్నారు. ఎంతో గొప్ప విలువలు, సదాచారం, క్రమశిక్షణ, దేశభక్తి, ధర్మంతో కూడిన విద్యాబోధన అందించే పవిత్ర ప్రాంతమని కొనియాడారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అద్భుతంగా రాణిస్తున్నారని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ‘పీఎం శ్రీ’ పథకం ద్వారా పాఠశాలలను దత్తత తీసుకుని, భారీగా నిధులు కేటాయిస్తూ అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తుండటం వల్లే ఇది సాధ్యమవుతోందని తెలిపారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులు భవిష్యత్తులో కరీంనగర్ కీర్తితో పాటు తెలంగాణ, భారతదేశ ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దేవసాని సరస్వతి-సత్యనారాయణ, కర్రె పద్మ-అనిల్, గాజ రమ-శివరాం, ఎన్నం లక్ష్మి-ప్రకాష్, జిల్లా విద్యాశాఖ అధికారులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

