ప్రత్యామ్నాయ ఆర్థిక వనరులతో పట్టణాభివృద్ధి: టీకే శ్రీదేవి

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: మున్సిపాలిటీలలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేవలం ప్రభుత్వ నిధులు, ఆస్తి పన్నులపైనే ఆధారపడకుండా బ్యాంకులు, అంతర్జాతీయ అభివృద్ధి సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా ప్రత్యామ్నాయ ఆర్థిక వనరులను సమీకరించుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి (TK Sreedevi) సూచించారు. వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యంతో పాటు, ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించే పట్టణాభివృద్ధి ప్రాజెక్టులను రూపొందించాలని అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పట్టణాభివృద్ధి, బాహ్య ఆర్థిక సహాయంతో చేపట్టే ప్రాజెక్టుల రూపకల్పన, అమలుపై కార్పొరేటర్ లు,కౌన్సిలర్ లు,మున్సిపల్ కమిషనర్లు, కార్పొరేషన్, మున్సిపాలిటీల అధికారులు, సిబ్బందికి నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

పట్టణీకరణకు అనుగుణంగా ప్రణాళికలు

తెలంగాణలో పట్టణీకరణ వేగంగా పెరుగుతున్నదని, రాష్ట్ర జనాభాలో సుమారు 52 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని శ్రీదేవి తెలిపారు. హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాలు, మున్సిపల్ కార్పొరేషన్లు, చిన్న మున్సిపాలిటీల అవసరాలు, జనాభా, ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. తెలంగాణ రైజింగ్–2047 విజన్‌లో భాగంగా పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, 2034ను మధ్యంతర లక్ష్యంగా నిర్దేశించుకుని ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రాంతాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు అదనపు ఆదాయాన్ని సమకూర్చేలా అభివృద్ధి చేయడమే లక్ష్యమని వివరించారు.

132 మున్సిపాలిటీలకు రూ. 15 కోట్ల చొప్పున నిధులు

గతంలో అమృత్, స్మార్ట్ సిటీ, స్వచ్ఛ భారత్ వంటి పథకాల ద్వారా అందిన నిధులతో పట్టణాల్లోని అన్ని అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చడం సాధ్యం కాలేదని పేర్కొన్నారు. దీని నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి 132 మున్సిపాలిటీలకు ఒక్కొక్కదానికి కనీసం రూ. 15 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.

యూఐడీఎఫ్ ద్వారా రూ. 2,800 కోట్ల ప్రాజెక్టులు

కేంద్ర ప్రభుత్వ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (యూఐడీఎఫ్) నిధులను సమర్థంగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని శ్రీదేవి వివరించారు. ఇతర రాష్ట్రాలు వినియోగించుకోని నిధులను సమీకరించి, మూడేళ్ల కాలానికి అందుబాటులోకి తీసుకురావడం ద్వారా తెలంగాణకు సుమారు రూ. 2,800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు అనుమతులు పొందగలిగామని తెలిపారు. మహబూబ్‌నగర్‌లో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటుకు రూ. 600 కోట్ల నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. సాధారణ బ్యాంకు రుణాలపై 8 నుంచి 9 శాతం వడ్డీ ఉండగా, యూఐడీఎఫ్ ద్వారా సుమారు 4.15 శాతం వడ్డీకే నిధులు లభించే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్టు రూపకల్పనలో విలీన గ్రామాలకు కూడా భూగర్భ డ్రైనేజీ సదుపాయాలు కల్పించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.

వరంగల్ తరహాలో ప్రణాళికలు

వరంగల్‌లో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఏర్పాటుకు రూ. 5,200 కోట్ల భారీ ప్రాజెక్టును ప్రభుత్వం మంజూరు చేసినట్లు శ్రీదేవి తెలిపారు. గతంలో స్మార్ట్ సిటీ పథకం కింద ఐదేళ్లలో రూ. 500 కోట్లు మంజూరైతే, అందులో రూ. 300 కోట్లు మాత్రమే వినియోగించారని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ కూడా భవిష్యత్తులో వరంగల్ తరహాలో భారీ అభివృద్ధి ప్రాజెక్టులను సాధించాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు సంప్రదాయ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. ప్రాజెక్టుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశాలను గుర్తించి, ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని, మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను రాష్ట్రంలోనే అత్యుత్తమ కార్పొరేషన్లలో ఒకటిగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమష్టిగా సహకరించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కోరారు. అభివృద్ధి పనులకు చిన్నచిన్న కారణాలతో అడ్డంకులు సృష్టించకుండా, కార్పొరేషన్ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అమలుకు సహకరించాలని సూచించారు. బాహ్య ఆర్థిక సహకారంతో చేపట్టే ప్రాజెక్టుల రూపకల్పన, అమలుపై అవగాహన కల్పించేందుకు మహబూబ్‌నగర్ జిల్లాను ఎంపిక చేసి వర్క్‌షాప్ నిర్వహించడం సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. ఈ అవకాశాన్ని బాధ్యతగా స్వీకరించి, జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. మహబూబ్‌నగర్‌లో అర్బన్ రెసిలియన్స్ అండ్ స్టేక్‌హోల్డర్స్ కన్సల్టేషన్ వర్క్‌షాప్ నిర్వహించడం సంతోషకరమని మేయర్ మమత అన్నారు. ఈ వర్క్‌షాప్ ద్వారా బాహ్య ఆర్థిక సహాయంతో చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టుల రూపకల్పన, పన్నుల వసూళ్ల ద్వారా మున్సిపాలిటీలకు ఆదాయ వనరుల పెంపు, ప్రాజెక్టుల ప్రతిపాదనల తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన విధానాలపై అవగాహన కల్పించడం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ అధికారులు, కార్పొరేటర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>