కలం, తెలంగాణ బ్యూరో: ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీనివల్ల పశుగ్రాసం కొరత ఏర్పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. నీటి లభ్యత ఉన్న చెరువులు, కుంటల శిఖం భూముల్లో పశుగ్రాసం సాగు చేయాలని (Fodder Cultivation) నిర్ణయించింది. 45 రోజుల్లో పచ్చిమేతను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్ అధ్యక్షతన నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.
నీటి వసతి ఉన్న చెరువులు, కుంటల పరిధిలోని శిఖం భూములను గుర్తించి, ఒక్కో ప్రాంతంలో ఐదు నుంచి పది ఎకరాల విస్తీర్ణంలో పశుగ్రాసం సాగు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. అనువైన భూములను గుర్తించే బాధ్యతను నీటిపారుదల, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కు అప్పగించారు. గుర్తించిన భూముల్లో సాగుకు అవసరమైన ఏర్పాట్లను వెంటనే చేపట్టి, 45 రోజుల్లోగా పశుగ్రాసాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.
సాగుకు అవసరమైన నిధులను ఉపాధి హామీ పథకం ద్వారా సమకూర్చనున్నారు. అధిక దిగుబడినిచ్చే సీఎస్హెచ్ 24-ఎంఎఫ్ రకం పశుగ్రాసాన్ని సాగు చేయాలని నిర్ణయించారు. అవసరమైన విత్తనాలను పశుసంవర్ధక శాఖ ఉచితంగా అందించనుంది. సాగు, సంరక్షణ, నీటి నిర్వహణ పనులను స్వయం సహాయక సంఘాల పర్యవేక్షణలో చేపట్టనున్నారు. భూముల గుర్తింపు నుంచి విత్తనాల సరఫరా, సాగు ఏర్పాట్లు, పంట నిర్వహణ వరకు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, పనుల్లో జాప్యం జరగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని దాన కిషోర్ ఆదేశించారు.
పశువులకు తాగునీటి తొట్టెలు
పశువులకు తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన ప్రాంతాల్లో నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. వీటి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని దాన కిషోర్ అధికారులకు సూచించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పశువులకు నిరంతరం తాగునీరు అందేలా చర్యలు తీసుకోనున్నారు. పశుగ్రాసం సాగు, నీటి తొట్టెల నిర్మాణ పనులను సమాంతరంగా చేపట్టి, వాటిని కూడా 45 రోజుల్లో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి ఇలంబర్తి, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్ శ్రీలక్ష్మి, జాయింట్ కమిషనర్ ఎం. శ్రీనివాస్, నీటిపారుదల, కమాండ్ ఏరియా అభివృద్ధి శాఖ (ఐ అండ్ సీఏడీ) ఈఎన్సీ రమేష్ బాబు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఈఎన్సీ మధుసూదన్, వీబీజీ రాంజీ అధికారులు పాల్గొన్నారు.

