Mobile Popup Ad
Mobile Popup Ad

అమరావతిలో జయశంకర్ విగ్రహం పెట్టాల‌ని చంద్రబాబుకు లేఖ!

క‌లం, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి (Amaravati)లో తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ (Prof Jayashankar) కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ తెలంగాణ యంగ్ థింకర్స్ ఫోరమ్ (Telangana Young Thinkers Forum) కన్వీనర్ రోహిత్ వక్రాల సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. అమరావతి ఏపీసీఆర్డీఏ పరిధిలో 10 అడుగుల ఎత్తున్న జయశంకర్ విగ్రహ ప్రతిష్టాపనకు తగిన స్థలాన్ని కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ నేతల విగ్రహాలు ఉన్నట్లే, అమరావతిలో జయశంకర్ సార్ విగ్రహం ఉండటం ఇరు రాష్ట్రాల మధ్య సౌభ్రాతృత్వానికి, పరస్పర గౌరవానికి నిదర్శనంగా నిలుస్తుందని లేఖలో పేర్కొన్నారు. పరిపాలనా పరంగా రాష్ట్రాలు వేరైనా, భాష, చరిత్ర, సంస్కృతిని పంచుకుంటున్న తెలుగు ప్రజల మధ్య సత్సంబంధాలకు ఇది దిక్సూచి అవుతుందని రోహిత్ వక్రాల ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యమానికి మేధోపరమైన దిశానిర్దేశం చేసిన జయశంకర్ సార్, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని, అటువంటి మహనీయుడిని గౌరవించడం ప్రజాస్వామ్య పరిపక్వతకు నిదర్శనమని ఫోరమ్ ప్రతినిధులు పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు విద్వేషాలు లేని, గౌరవప్రదమైన సంబంధాలను అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, అమరావతిలో విగ్రహ ఏర్పాటు ద్వారా తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం మరింత బలపడుతుందని వారు వివరించారు. ఈ ప్రతిపాదనపై ఇరు రాష్ట్రాల మేధావులు, విద్యావంతుల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సమీపిస్తున్న తరుణంలో ఈ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>