Mobile Popup Ad
Mobile Popup Ad

సరికొత్త హంగులతో ‘కిన్నెరసాని’

కలం, ఖమ్మం బ్యూరో : పచ్చని అడవులు, పరవళ్లు తొక్కే జలాశయం, కనువిందు చేసే వన్యప్రాణులతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకే తలమానికమైన కిన్నెరసాని వైల్డ్‌లైఫ్ శాంక్చురీ (Kinnerasani Wildlife Sanctuary) జూన్ నెల నుంచి సరికొత్త రూపంలో పర్యాటకులను పలకరించనుంది. ఇప్పటివరకు కేవలం ఒక సాధారణ వీకెండ్ స్పాట్‌గా ఉన్న కిన్నెరసానిని, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన సమగ్ర ఎకో-టూరిజం హబ్‌గా మార్చేందుకు అటవీశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఒకే ఇంటెగ్రేటెడ్ ప్యాకేజీ కింద ఫారెస్ట్ సఫారీ, కొండల్లో ట్రెక్కింగ్, జలాశయంలో బోటింగ్ తో పాటు సుందరమైన డీర్ పార్క్ సందర్శనను అందుబాటులోకి తెస్తూ పర్యాటక రంగంలో సరికొత్త విప్లవానికి అధికారులు తెరతీస్తున్నారు. ​ఇప్పటివరకు పర్యాటకులు కిన్నెరసాని డ్యామ్, ప్రవేశ ద్వారం వద్ద ఉన్న వ్యూ పాయింట్లకే పరిమితం కాగా, ఇకపై దట్టమైన అడవి గుండెల్లోకి ప్రయాణించే థ్రిల్లింగ్ అనుభూతి లభించనుంది. అటవీశాఖ ఇందుకోసం ప్రత్యేకంగా మూడు ఓపెన్ సఫారీ వాహనాలను సిద్ధం చేసింది. వన్యప్రాణుల జీవన విధానానికి ఎటువంటి అంతరాయం కలగకుండా అడవి లోపల పది కిలోమీటర్ల మేర రెండు ప్రత్యేక రూట్లను అధికారులు అభివృద్ధి చేశారు. కిన్నెరసాని నుంచి అడవి లోపల ఉండే “కుహు కుహు” వాచ్ టవర్ వరకు సాగే ఈ సఫారీ ప్రయాణంలో అడవి కోళ్లు, నెమళ్లు, దుప్పులు, నీలగాయ్ వంటి వన్యప్రాణులను పర్యాటకులు నేరుగా వీక్షించవచ్చు.

​కేవలం సఫారీ మాత్రమే కాకుండా సాహస ప్రియులను ఆకర్షించేందుకు యనాంబైలు ప్రాంతంలోని ‘హరిణి వాచ్ టవర్’ పరిసరాల్లో ప్రత్యేక ప్రకృతి నడక మార్గాలను సిద్ధం చేస్తున్నారు. పక్షుల కిలకిలారావాల నడుమ, కొండలు-కోనల గుండా సాగే ఈ ట్రెక్కింగ్ యువతకు సరికొత్త అడ్వెంచర్ అనుభవాన్ని ఇవ్వనుందని అటవీ శాఖ అభిప్రాయ పడుతుంది. అలాగే కిన్నెరసాని జలాశయంలో బోట్ షికారును మరింత ఉత్సాహభరితంగా మార్చేందుకు అటవీశాఖ రూ. 30 లక్షల వ్యయంతో అధునాతనమైన మరో రెండు కొత్త బోట్లను ఇప్పటికే కొనుగోలు చేసింది. ప్రస్తుతం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉన్న స్పీడ్ బోట్లతో పాటు ఇవి కూడా తోడైతే పర్యాటకుల నిరీక్షణ సమయం గణనీయంగా తగ్గుతుంది.

​ఈ ప్రాజెక్టులో మరో ప్రధాన ఆకర్షణ ప్రవేశ ద్వారంలోనే ఉన్న డీర్ పార్క్. ఇక్కడ దాదాపు 160 కి పైగా చుక్కల దుప్పులు, అడవి గొర్రెలు పర్యాటకులను అలరిస్తుండగా, వీటితో పాటు అరుదైన ‘మూషిక జింకలు’ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. దీనికి ఆనుకుని ఉన్న ‘ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ మ్యూజియం’ ద్వారా కేవలం వినోదమే కాకుండా, పర్యావరణ సమతుల్యత వన్యప్రాణుల సంరక్షణపై పిల్లలకు డిజిటల్ మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. పర్యాటకులు రాత్రి వేళల్లో బస చేయడానికి తెలంగాణ టూరిజం హరిత కాటేజీలు, ఫొటో షూట్ల కోసం అద్భుతమైన అద్దాల మేడ ఇక్కడ ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.

​ఈ సరికొత్త ఎకో-టూరిజం ప్రాజెక్ట్ కేవలం పర్యాటకాన్నే కాకుండా స్థానిక గిరిజన యువతకు గైడ్‌లుగా, సఫారీ డ్రైవర్లుగా ఉపాధి అవకాశాలను కల్పిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపనుంది. భద్రాచలం రామాలయ దర్శనానికి వచ్చే భక్తులు, ప్రకృతి ప్రేమికులు తమ వీకెండ్ ప్లాన్స్‌లో కిన్నెరసానిని ఒక ‘మస్ట్ విజిట్’ స్పాట్‌గా మార్చుకునేలా ఈ మార్పులు దోహదపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవలే డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ కిష్టాగౌడ్, పాల్వంచ వైల్డ్‌లైఫ్ డివిజన్ డెప్యూటీ కన్జర్వేటర్ ఎం. బాబు స్వయంగా సఫారీ రూట్లలో ట్రయల్ రన్ నిర్వహించి భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. రాబోయే వారం రోజుల లోపల ఈ సేవలను అధికారికంగా ప్రారంభించి పర్యాటకులను అనుమతించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>