కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో భిన్న వాతావరణం (Telangana Weather) నెలకొంది. రాష్ట్రంలో ఓ వైపు ఎండల తీవ్రత కొనసాగుతుండగా.. మరోవైపు వర్షాలు పడుతున్నాయి. సోమవారం పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అయితే మంగళవారం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షం పడుతుందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
మరోవైపు రాష్ట్రంలో రోజురోజుకు ఎండల తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. సోమవారం అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మెండోరాలో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రాబోయే రెండ్రోజులు తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని, ప్రజలు బయటకు వెళ్లే సమయంలో ఎండదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

