కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ధర్మసాగర్ చెరువు (Dharmasagar Lake) భూముల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు మంగళవారం జేసీబీ సాయంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. సుమారు ఎకరం చెరువు భూమి ఆక్రమణకు గురైనట్లు, ఆ భూమి విలువ దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
గతంలో ధర్మసాగర్ చెరువు పరిధిలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయగా, ఆ ప్రాంతంలోని చెరువు భూములను కొందరు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు కలెక్టర్ భవేశ్ మిశ్రాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు స్పందించిన కలెక్టర్ అక్రమ నిర్మాణాలను తొలగించాలని రెవెన్యూ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు.
సర్వే నంబర్లు 2031, 2032 పరిధిలోని ధర్మసాగర్ చెరువు భూముల ఆక్రమణలపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. చెరువు భూములు భవిష్యత్తులో ఆక్రమణలకు గురికాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కూల్చివేత కార్యక్రమంలో అర్బన్ తహసీల్దార్ రాజు, మున్సిపల్ కమిషనర్ రవిబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి అనురాధ, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

