యువత డ్రగ్స్ వదిలి క్రీడలవైపు రావాలి: రేవంత్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)  పేర్కొన్నారు. 140 కోట్ల మంది ఉన్న మనదేశంలో ఎంత మంది క్రీడాకారులు తయారవుతున్నారని ప్రశ్నించారు. చిన్న చిన్న దేశాలు ఒలింపిక్స్ సాధిస్తుంటే మనదేశం ఎందుకు వెనుకబడిందని పేర్కొన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ నెలకొల్పి క్రీడాకారులను తయారు చేయాలని సంకల్పించామని పేర్కొన్నారు. ఉత్తరకొరియా లాంటి చిన్న దేశాల నుంచి ప్రతి ఏడు ఒలింపిక్స్ సాధిస్తుంటే .. మన దేశం ఎందుకు వెనకబడిందో ఆలోచించాలన్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన 74వ బీఎన్ ముల్లిక్ స్మారక అఖిల భారత పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ 2026 ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఫుట్ బాల్ చరిత్రలో హైదరాబాద్‌కు ఎంతో పేరు

భార‌త ఫుట్‌బాల్ చ‌రిత్ర‌లో హైద‌రాబాద్ న‌గ‌రానికి విశేషమైన పేరు ప్ర‌ఖ్యాత‌లు ఉన్నాయని రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)  పేర్కొన్నారు. 1950 నుంచి 60 వ‌ర‌కు న‌ర్సరీ ఆఫ్ ఇండియన్ ఫుట్ బాల్‌గా హైద‌రాబాద్‌ను పిలిచేవారని గుర్తు చేశారు. 1956లో ఒలంపిక్స్ లో ఆడిన ఫుట్ బాల్ జ‌ట్టులో ఏడుగురు క్రీడాకారులు హైద‌రాబాద్‌కు చెందిన వారని గుర్తు చేశారు. హైద‌రాబాద్ పోలీస్ ఫుట్‌బాల్ టీం‌కి కూడా దేశంలో మంచి పేరుందని చెప్పారు. దేశంలోనే ఫుట్ బాల్ ఆట‌ను ఆద‌రించి అగ్ర‌శేణి క్రీడాకారుల‌ను హైద‌రాబాద్ అందించిందన్నారు. గచ్చిబౌలిలో స్టేడియంలో ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. టోర్న‌మెంట్‌లో 34 జ‌ట్లు అద్భుత‌మైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారన్నారు. దేశం న‌లుమూల నుంచి క్రీడాకారులు త‌ర‌లివ‌చ్చి మంచి ప్ర‌ద‌ర్శ‌న‌ను క‌న‌ప‌ర్చిన వారందరికి అభినందన‌లు తెలిపారు. యువత నెమ్మ‌దిగా క్రీడ‌ల‌కు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడా మైదానాల‌ను వ‌దిలిపెట్టి యువ‌త త‌ప్పు చేస్తున్నారన్నారు.

సౌత్ కొరియా స్పోర్ట్స్ వర్సిటీ ఆదర్శనీయం

‘సౌత్ కొరియాలో స్పోర్స్ యూనివ‌ర్సిటీ ని నేను సంద‌ర్శించాను. 30 ఎక‌రాల్లో ఉన్న స్పోర్స్ యూనివర్సిటీ అనేక బంగారు ప‌త‌కాలు సాధించింది. 140 కోట్ల జ‌నాభా ఉన్న మ‌న దేశంలో ఒక్క బంగారు ప‌త‌కం రాలేదు. 4 కోట్ల జ‌నాభా ఉన్న సౌత్ కొరియా దేశం 30కి పైగా ప‌త‌కాలు సాధించింది. సౌత్ కొరియాలో ఒక్క అమ్మాయి 2 బంగారు ప‌త‌కాలు సాధిస్తే ఇంత పెద్ద దేశం ఒక్క ప‌త‌కాన్ని తెచ్చుకోలేక‌పోయింది. అంతర్జాతీయ స్థాయిలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ‌ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రైవేట్, ప‌బ్లిక్ భాగ‌స్వామ్యంలో ఏర్పాటయ్యే ఈ యూనివ‌ర్సిటీలో ప్ర‌ముఖ క్రీడాకారులు, పారిశ్రామిక‌వేత్త‌లు బోర్డు మెంబ‌ర్స్‌గా ఉన్నారు. ప‌బ్ ,డ్ర‌గ్ క‌ల్చ‌ర్‌లోకి వెళ్తున్న యువ‌త‌ను తిరిగి క్రీడా మైదానాల్లోకి ర‌ప్పించ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నాను. బాగా చ‌దువుకునే యువ‌త‌నే డ్ర‌గ్స్ బారిన ప‌డుతున్నారు. పంజాబ్ యువ‌త డ్ర‌గ్స్ బారి ప‌డ్డారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఒక్కప్పుడు వీరులను పంజాబ్ అందించింది. మ‌రో పంజాబ్‌గా ఈ ప్రాంతాన్ని కానివ్వం. నేరాల తీరు ఇప్పుడు మారిపోయింది.’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఏఐ నాలెడ్జ్ వెపన్‌

‘ప్రస్తుతం ఏఐ డ‌బ‌ల్ ఎడ్జ్ వెఫ‌న్‌గా మారింది. డ్ర‌గ్స్ , సైబ‌ర్ నేరాలు పోలీసులకు స‌వాల్ గా మారాయి. వీటిని నియంత్రించాల్సిన బాధ్య‌త పోలీసుల‌ది. దేశం కోసం ఏమైనా చేయ‌డానికి మ‌నంద‌రం సిద్ధంగా ఉండాలి. దేశ యువ‌త‌ స‌రైన ద‌శ‌లో వెళ్ల‌క‌పోతే భ‌విష్య‌త్తులో తీర‌ని న‌ష్టం జ‌రుగుతుంది. యువ‌త‌కు మార్గ‌ద‌ర్శ‌నం చేయాలనే హైద‌రాబాద్ కు మెస్సీని తీసుకువ‌చ్చాను. ఎస్సీ, ఆదివాసీ పిల్ల‌లకు మెస్సీతో కలిసి ఫుట్ బాల్ ఆడే అవ‌కాశం క‌ల్పించాం. బాక్సింగ్ ఛాంపియ‌న్ నిక్క‌త్ జ‌రీన్ కు గ్రూప్ 1 ఉద్యోగం తో పాటు 2 కోట్ల న‌గ‌దు పుర‌స్కారం అందించాం. 10 వ త‌ర‌గ‌తి ఫెయిల్ క్రికెటర్ సిరాజ్ కు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వ‌డానికి అర్హ‌త లేక‌పోయినా అన్ని నిబంధ‌న‌లు స‌డ‌లించి డీఎస్పీ ఉద్యోగం ఇచ్చాం. ఫారా ఒలింపిక్స్ లో రాణించిన దీప్తి జురాంజి కి గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చాం. క్రీడ‌ల్లో రాణించే తెలంగాణ యువ‌త‌కు ఉద్యోగాలు త‌ప్ప‌కుండా వస్తాయి’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>