కలం, తెలంగాణ బ్యూరో: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వికసిత్ భారత్ జీ రామ్ జీ (VB G RAM G) చట్టాన్ని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) సిద్ధమైంది. ఇంతకాలం దీన్ని వ్యతిరేకించినప్పటికీ.. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చివరికి వెనక్కి తగ్గే పరిస్థితి కనిపిస్తున్నది. కొత్త చట్టానికి బుధవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. కేబినెట్ నిర్ణయం వెలువడగానే పంచాయతీరాజ్ శాఖ నుంచి అధికారిక నోటిఫికేషన్ వస్తుంది.
రాష్ట్రాల హక్కులకు భంగం కలిగిస్తోందని, గ్రామీణ ఉపాధి వ్యవస్థను బలహీనపరుస్తోందంటూ ఇంతకాలం జీ రామ్ జీ స్కీమ్ను రాష్ట్ర ప్రభుత్వం తప్పుబట్టింది. దీనిపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి న్యాయపరంగా పోరాడాలని నిర్ణయించింది. స్వయంగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని కలిసి మంత్రి సీతక్క కొన్ని అభ్యంతరాలు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి నిధుల అవసరం, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు, ఎల్ నినో కారణంగా పేదలకు ఉపాధి కల్పించడం.. వీటన్నింటి నేపథ్యంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించినట్లు తెలుస్తున్నది.
ఆర్థిక అంశాలే కారణం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులేనని ప్రభుత్వం వైఖరిలో మార్పు రావడానికి ప్రధాన కారణం అని తెలుస్తున్నది. సంక్షేమ పథకాలు, ఉచిత విద్యుత్, ఉద్యోగుల జీతభత్యాలు, పాత అప్పులకు వడ్డీ చెల్లింపులు.. ఇవన్నీ రాష్ట్ర ఖజానాకు ఇప్పటికే భారంగా మారాయి. కేంద్రం నుంచి వచ్చే నిధులను కోల్పోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై మరింత భారం పడుతుందని ప్రభుత్వం భావించినట్లు సమాచారం. కొత్త చట్టాన్ని అడాప్ట్ చేసుకుని అమలు చేస్తే రాష్ట్ర ఖజానాపై ఏటా సుమారు రూ. 2,550 కోట్ల మేర భారం పడుతుంది. అమలు చేయకపోతే దాదాపు ఆరు వేల కోట్లను రాష్ట్రమే ఉపాధి హామీ అవసరాల నిమిత్తం భరించాల్సి వస్తుంది. కొత్త చట్టం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ముందు నుయ్యి.. వెనక గొయ్యి తరహా పరిస్థితి నెలకొన్నది. ప్రస్తుత పరిస్థితుల్లో భరించడం కష్టసాధ్యమనే భావనతో అమలు చేయడానికే మొగ్గు చూపే అవకాశం ఉంది.
కేబినెట్ తీసుకునే నిర్ణయమే కీలకం
సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ‘జీ-రామ్-జీ’ చట్టం అమలుపై సమగ్ర చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ రెండుసార్లు సమావేశమై లోతుగా చర్చించింది. ఆ సిఫారసులను కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. చట్టాన్ని అడాప్ట్ చేసుకునేందుకు ఆమోదం లభించిన వెంటనే పంచాయతీరాజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసి అమలు ప్రక్రియ ప్రారంభిస్తుందని సమాచారం. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం రాష్ట్రాల హక్కులకు విరుద్ధమని తీవ్రంగా విమర్శించిన రాష్ట్ర ప్రభుత్వం.. కర్నాటక, తమిళనాడు, కేరళం రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి ఉమ్మడి కార్యాచరణ చేపట్టనున్నట్లు కేబినెట్ సబ్ కమిటీ తీర్మానించింది. ఇప్పుడు కేంద్ర చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంటే రాజకీయంగా చర్చకు దారితీసే అవకాశం ఉంది.
60 రోజుల నిబంధనలో సడలింపులు
‘జీ-రామ్-జీ’ చట్టంలో ‘60 రోజుల విరామం’ నిబంధనపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నిబంధన గ్రామీణ కార్మికుల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వాదించింది. కానీ రాష్ట్ర మంత్రి సీతక్క ఇటీవల ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రికి మెమొరాండం ఇచ్చి నిబంధన సడలింపుపై రిక్వెస్ట్ చేయడంతో సానుకూల స్పందన వచ్చినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఈ నిబంధనలో తగిన సవరణలు చేసుకోవచ్చనే గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలిసింది. దీంతో చట్టాన్ని అమలు చేసేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందన్నది పంచాయతీరాజ్ శాఖ వర్గాల సమాచారం. కొత్త చట్టాన్ని రాజకీయాలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రయోజనాలనే ప్రామాణికంగా తీసుకుని క్యాబినెట్ సమావేశం నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నట్లు తెలిసింది. కొత్త చట్టాన్ని వ్యతిరేకించడం ద్వారా నష్టపోయేది రాష్ట్రమేననే అభిప్రాయమూ వ్యక్తమవుతున్నది.

