మళ్లీ సాగర్ క్వార్టర్స్ రచ్చ.. రెగ్యులరైజేషన్​ కు గ్రీన్ సిగ్నల్..?

కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుల (ఏఎమ్మార్పీ) కోసం సేకరించిన భూములు, వాటిలో నిర్మించిన సాగర్ క్వార్టర్ల (Sagar Quarters) క్రమబద్ధీకరణ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ, స్థానికుల వినతుల నేపథ్యంలో జీవో 59 కింద ఏళ్లుగా పెండింగ్లో ఉన్న 4,367 దరఖాస్తుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో కసరత్తు వేగవంతం చేసింది. లబ్ధిదారులకు ఫోన్లు చేస్తూ డిమాండ్ నోటీసులు జారీ చేసి, నిర్ణీత రుసుము చెల్లించాలని సూచిస్తున్నది.

ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అయితే, వేలాది దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన గానీ, స్పష్టమైన మార్గదర్శకాలు గానీ వెలువడలేదు. కేవలం పాత పెండింగ్ దరఖాస్తులనే పరిష్కరిస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, మౌఖిక ఆదేశాలతో ప్రక్రియ ముందుకు సాగడంపై క్షేత్రస్థాయిలో ఒకింత ఆందోళన వ్యక్తమవుతున్నది.

మూడు దశల్లో 4,367 ఫైళ్లు..

ప్రభుత్వ భూముల ఆక్రమణల క్రమబద్ధీకరణ కోసం 2014 డిసెంబర్ 30న జీవో 59 జారీ చేశారు. అభ్యంతరాలు లేని ప్రభుత్వ భూములు, యూఎల్సీ మిగులు స్థలాలను నిర్ణీత రుసుముతో క్రమబద్ధీకరించడం దీని ఉద్దేశం. తొలుత 500 గజాల వరకు పరిమితి విధించగా, 2017లో జీవో 35 ద్వారా దాన్ని వెయ్యి గజాలకు పెంచారు. అంతకుమించిన విస్తీర్ణానికి కలెక్టర్లకు అనుమతి అధికారం లేకపోవడంతో ఆ ఫైళ్లను ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలో 4,367 దరఖాస్తులు మూడు దశల్లో పెండింగ్లో ఉన్నాయి. వీటిలో 3,727 కలెక్టర్ ఆమోదం కోసం, 554 నిర్ణీత ఫీజుల చెల్లింపు కోసం, మరో 86 రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాకుండా నిలిచిపోయాయి.

మిర్యాలగూడలోనే అత్యధికం

మండలాల వారీగా చూస్తే మిర్యాలగూడలో 2,783, పెద్దవూరలో 952, నల్లగొండలో 147 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. మిగిలిన 485 దరఖాస్తులు ఇతర మండలాలకు చెందినవి. వీటిలో మిర్యాలగూడ, నందికొండ మున్సిపాలిటీల పరిధిలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్వార్టర్ల (Sagar Quarters) లో ఏళ్లుగా నివాసం ఉంటున్న కుటుంబాల దరఖాస్తులే అధికంగా ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే, ప్రాజెక్టుల నిర్మాణం కోసం సేకరించిన భూముల్లో నిర్మించిన ప్రభుత్వ క్వార్టర్లను జీవో 59 కింద క్రమబద్ధీకరించడం నిబంధనలకు విరుద్ధమనే ఆరోపణలు గతంలోనే వెల్లువెత్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ వ్యవహారాలపై విచారణ చేపట్టి నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో పలు వివాదాస్పద రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. మరోవైపు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకే పాత దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

జాబితాలో ఉద్దండులు..

నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని విశాలమైన ఈఈ, ఏఈ టైపు క్వార్టర్ల క్రమబద్ధీకరణ జాబితాలో పలువురు రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తల పేర్లు ఉండటం గతంలో తీవ్ర చర్చకు దారితీసింది. వీరిలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి, మాజీ ఎంపీ కే కేశవరావు, దివంగత మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ యెడవల్లి విజయేందర్ రెడ్డి, పెద్దవూర ఎంపీపీ సీహెచ్ అనురాధ, జెడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి ఉన్నారు. అలాగే జడ్జి ఏ రాజశేఖర్ రెడ్డి, ఓఎస్డీలు టీ చంద్రశేఖర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, రిటైర్డ్ సీఈ కే భాగ్యతారెడ్డి, రిటైర్డ్ డీఈ డీ విష్ణుమూర్తి, కాంట్రాక్టర్ డీ నాగేశ్వరరావు, నాట్కో ఎండీ, ఏపీ ఫార్మా కంపెనీ, గడ్డం రవీందర్ రెడ్డి, బీ శ్రీనివాసరాజు, ఎం.లింగారెడ్డి, గాదె ప్రవల్లిక చౌదరి తదితరుల పేర్లు కూడా జాబితాలో ఉన్నట్లు గతంలో వెల్లడైంది.

పేదలకా? పెద్దలకా?

దశాబ్దాలుగా క్వార్టర్లలో నివసిస్తున్న సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు యాజమాన్య హక్కులు కల్పించాలన్న ఎన్నికల హామీ ఒకవైపు.. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవాలన్న లక్ష్యం మరోవైపు ఈ ప్రక్రియకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అయితే, గతంలో ప్రముఖులు, బడాబాబులకు జరిగిన వివాదాస్పద కేటాయింపులపై విచారణ నివేదికను బహిర్గతం చేయకుండా, స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయకుండానే పాత ఫైళ్లను కదపడం అనుమానాలకు తావిస్తున్నది. ఈ నేపథ్యంలో సామాన్యుల దరఖాస్తులను మాత్రమే పరిష్కరించి, వివాదాస్పద ప్రముఖుల క్వార్టర్లను పక్కన పెడతారా? లేక జాబితాలోని ప్రముఖుల దరఖాస్తులనూ అదే నిబంధనలతో పరిష్కరిస్తారా? అన్నది ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉత్కంఠ రేపుతున్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>