కలం, ఖమ్మం బ్యూరో: ఎస్సీ, ఎస్టీల కేసుల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించేది లేదని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య (Bakki venkataiah) హెచ్చరించారు. బాధితులకు ఎఫ్ఐఆర్ నమోదు నుంచి చార్జ్‌షీట్, పరిహారం అందే వరకు ప్రక్రియ పారదర్శకంగా జరగాలని అధికారులను ఆదేశించారు. సోమవారం భద్రాద్రి జిల్లా ఐడీవోసీలో ముగ్గురు కమిషన్ సభ్యులతో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో నమోదైన 1,115 అట్రాసిటీ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం విచారణలో ఉన్న 51 కేసులు, పెండింగ్‌లో ఉన్న 20 కేసులను వెంటనే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని స్పష్టం చేశారు.
ఎస్సీ, ఎస్టీల ఆర్థిక పురోగతే లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలు తెచ్చిందని, వివిధ శాఖల్లో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కమిషన్ చైర్మన్ ఆదేశించారు. గిరిజన మహిళా సంఘాల ప్రోత్సాహానికి భద్రాచలంలో ఏర్పాటు చేసిన “భద్రాద్రి గిరి మార్ట్” ఆదర్శనీయమని పేర్కొంటూ ఐటీడీఏ పీవో రాహుల్‌ను అభినందించారు. అనంతరం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల దరఖాస్తులను స్వీకరించి, తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఐటీడీఏ పీవో రాహుల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన అధికారులు పాల్గొన్నారు.

