కలం, వెబ్ డెస్క్: తెలంగాణ (Telangana) వ్యాప్తంగా పెట్రోల్ కొరత (Petrol Shortage) పై వదంతులు ఊపందుకున్నాయి. హైదరాబాద్ సహా దాదాపు అన్ని జిల్లాల్లో పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యూ కట్టారు. దీంతో తెలంగాణ పెట్రోలియం అసోసియేషన్ (Telangana Petroleum Dealers Association) కీలక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో ఇంధన కొరత లేదని, అందుబాటులో సరిపడా నిల్వలు ఉన్నాయని స్పష్టం చేసింది. హెచ్‌పీసీఎల్, ఐవోసీఎల్, బీపీసీఎల్ కంపెనీల దగ్గర నిల్వలు ఉన్నాయని పేర్కొంది. రాష్ట్రంలో ఇంధన కొరత ఉందన్న ప్రచారాన్ని ఖండించింది. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దని కోరింది. బంకుల మూసివేతపై స్పందిస్తూ.. బంకుల వద్ద విపరీతమైన రద్దీతో కొన్ని పెట్రోల్ బంకుల్లో తాత్కాలికంగా కొరత ఏర్పడిందని, వాటిని మళ్ల పునరుద్ధరిస్తున్నామని స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో తప్పుడు వార్తల కారణంగా వాహనదారులు ఒక్కసారిగా బంకులకు పోటెత్తడంతో అమ్మకాలు సాధారణం కంటే 3 రెట్లు పెరిగాయని అసోసియేషన్ వెల్లడించింది. పెట్రోల్, డీజిల్‌ను డబ్బాలు లేదా క్యాన్లలో నింపి నిల్వ చేయడం పెసో (PESO) నిబంధనలకు విరుద్ధమని, ఇది అత్యంత ప్రమాదకరమని అసోసియేషన్ హెచ్చరించింది. ఇళ్ల వద్ద ఇంధనాన్ని దాచుకోవడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రజలు తమ రెగ్యులర్ అవసరాలకు మించి కొనుగోలు చేయవద్దని కోరింది. ముఖ్యంగా డబ్బాలలో పెట్రోల్ తీసుకెళ్లడం భద్రతా దృష్ట్యా నిషిద్ధమనిగుర్తు చేసింది. అనవసరంగా భయాందోళనలకు గురై బంకుల వద్ద రద్దీ సృష్టించవద్దని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అసోసియేషన్ కోరింది. తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, అవాస్తవాలను ఇతరులకు షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేస్తూ, అందరికీ ఇంధనం అందుబాటులో ఉండేలా సహకరించాలని ప్రకటనలో పేర్కొంది.
Read Also: ఇరాన్ వార్.. యూరియా క్రైసిస్
Follow Us On: X(Twitter)

