కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో ఇంధన నిల్వల (Petrol Shortage)పై ప్రజల్లో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కీలక వివరణ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఎనభై రోజులకు సరిపడా పెట్రోలు, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ రాబోయే రోజుల్లో ధరలు భారీగా పెరుగుతాయనే ప్రచారం సామాన్యులను కలవరపెడుతోంది. ఈ భయంతోనే వాహనదారులు తమ అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారు. రోజువారీ సగటు విక్రయాల కంటే అధిక మొత్తంలో అమ్మకాలు జరుగుతుండటంతో బంకుల్లో నిల్వలు త్వరగా కరిగిపోతున్నాయని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. బఫర్ స్టాక్ లేని చోట్ల యాజమాన్యాలు నో స్టాక్ బోర్డులు పెడుతున్నాయి. ఫలితంగా కృత్రిమ కొరత ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు పెట్రోల్ బంకు డీలర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు. రాష్ట్రంలోని సుమారు ముప్పై శాతం బంకుల్లో స్టాక్ లేకపోవడం వాస్తవమని ఆయన పేర్కొన్నారు. ఆయిల్ కంపెనీల నుంచి సరఫరా క్రమంగా తగ్గడం వల్ల ఈ సమస్య తలెత్తుతోందని వివరించారు. డిమాండ్‌కు తగ్గట్టుగా కంపెనీలు సప్లయ్ చేయకపోవడం వల్లే వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే చొరవ చూపి ఆయిల్ కంపెనీలతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. సరఫరా వ్యవస్థను మెరుగుపరిస్తేనే ఈ సంక్షోభం (Petrol Shortage) నుంచి గట్టెక్కడం సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also: అమ్రాబాద్ అడవుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
Follow Us On: Instagram

