కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కోసం రాష్ట్ర నాయకత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) గురువారం జిల్లా ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, ట్రెజరర్, స్పోక్స్ పర్సన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లను ప్రకటించడం జరిగింది. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ (Nuthi Satyanarayana) సూచనల మేరకు 80 మందితో జిల్లా కార్యవర్గాన్ని నియమిస్తున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. వీరంతా జిల్లాలో కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి వరకూ తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేస్తారని ఆశా భావం వ్యక్తం చేశారు.
ఖమ్మం (Khammam) జిల్లా నుంచి ఇప్పటికే ముగ్గురు మంత్రులు కేబినెట్‌లో ఉన్నారు. జిల్లాను జెట్ స్పీడ్‌లో అభివృద్ధి చేస్తున్నారు. ప్రభుత్వం పరంగా ఇస్తున్న పథకాలలో జిల్లా ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Indlu) మంజూరులో, నిర్మాణంలో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. అయినప్పటికీ పార్టీ పరంగా వెనుకబడి ఉన్నట్లుగా గమనించిన రాష్ట్ర నాయకత్వం.. భారీ స్థాయిలో 80 మందితో జిల్లా కార్యవర్గాన్ని నియమించింది. వీరిలో 11 మంది ఉపాధ్యక్షులు, 22 మంది జనరల్ సెక్రటరీలు, 26 మంది సెక్రటరీలు, 15 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లు, 5 మంది స్పోక్స్ పర్సన్‌లు, ఒక ట్రెజరర్ ఉండటం గమనార్హం.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పది స్థానాలలో తొమ్మిది స్థానాలు కైవసం చేసుకుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మూడో వంతు స్థానాలు దక్కించుకుంది. ఇదే రీతిగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో మొత్తం 10 స్థానాలు కైవసం చేసుకునే దిశగా.. ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందని ఈ జంబో జిల్లా కార్యవర్గ నియామకంతో వెల్లడైంది. మొత్తం మీద జిల్లా అధ్యక్షునితో కలిపి 81 మంది కార్యవర్గం పార్టీని గ్రామ స్థాయి వరకూ తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు, ప్రభుత్వ పథకాలను నిజమైన లబ్ధిదారులకు అందించడంలో కీలక పాత్ర పోషించాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.
Read Also: అశ్వారావుపేటలో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై బాలుడు అఘాయిత్యం
Follow Us On: Facebook

