కలం, స్పోర్ట్స్ : భారత టెన్నిస్ ప్లేయర్ రామ్‌కుమార్ రామనాథన్ (Ramkumar Ramanathan) మరో అంతర్జాతీయ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. విజయ్ సుందర్ ప్రశాంత్‌తో కలిసి బాన్ ఓపెన్-2026 డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో ఇంగ్లాండ్‌కు చెందిన స్కాట్ డంకన్, స్వీడన్ ఆటగాడు ఆడమ్ హైనోనెన్ జోడీని వరుస సెట్లలో ఓడించి ట్రోఫీని అందుకున్నాడు. ఈ ఏడాది రామ్‌కుమార్‌కు ఇది రెండో ఏటీపీ ఛాలెంజర్ డబుల్స్ టైటిల్ కావడం విశేషం.
అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన రామ్‌కుమార్-ప్రశాంత్ జోడీ మొత్తం టోర్నీలో ఒక్క సెట్ కూడా కోల్పోలేదు. ఫైనల్లో 7-6(4), 6-3తో ప్రత్యర్థులను ఓడించింది. గంటా 31 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ అసాధారణ పోరాట పటిమను ప్రదర్శించింది. మ్యాచ్ మొత్తం మీద భారత జోడీ తొమ్మిది బ్రేక్ పాయింట్లను సమర్థంగా కాపాడుకుంది. తొలి సెట్‌లో ఆరు బ్రేక్ పాయింట్లను నిలువరించి టైబ్రేక్‌కు తీసుకెళ్లింది. అక్కడ ఆధిపత్యం చాటుతూ సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్ తొలి గేమ్‌లో మరో మూడు బ్రేక్ పాయింట్లను సేవ్ చేసిన రామ్‌కుమార్-ప్రశాంత్.. ఆరో గేమ్‌లో కీలక బ్రేక్ సాధించి మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నారు.
టోర్నీ తొలి రౌండ్‌లో జర్మనీకి చెందిన జానిక్ ఒపిట్జ్-లూయిస్ వెస్సెల్స్ జోడీని 6-4, 6-4తో ఓడించారు. క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ అర్జున్ కధే-సైమన్ కిలాన్ జోడీపై 6-3, 6-4తో విజయం సాధించారు. సెమీఫైనల్లో ఇగ్నాసియో కారౌ-ఫెడెరికో అగస్టిన్ గోమెజ్ జోడీని 6-2, 6-3తో చిత్తు చేసి ఫైనల్‌కు చేరుకున్నారు. ఈ విజయంతో రామ్‌కుమార్ రామనాథన్ తన కెరీర్‌లో 13వ ఏటీపీ ఛాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను అందుకున్నాడు. ఈ ఏడాది జూన్‌లో రిత్విక్ బొల్లిపల్లితో కలిసి టెక్సాస్ స్పైన్ అండ్ జాయింట్ ఛాలెంజర్ టైటిల్ గెలిచిన తర్వాత.. ఇప్పుడు బాన్ ఓపెన్‌లోనూ మరో ట్రోఫీని సొంతం చేసుకున్నాడు.

