కలం, తెలంగాణ బ్యూరో: అనుమతి లేకుండా లేఔట్లు వేసి క్రమబద్ధీకరించుకోవాలనుకునే యజమానులకు పురపాలక అభివృద్ధిశాఖ బంపర్ ఆఫర్ ప్రకటించింది. క్రమబద్ధీకరణ కోసం గతంలో దరఖాస్తు చేసుకుని ఫీజు, ఇతర చార్జీలు చెల్లించనివారు ఇప్పుడు 25% తగ్గింపు ఆఫర్ పొందవచ్చని తాజాగా జారీచేసిన జీవోలో పేర్కొన్నది. ఈ అవకాశం మే 1 నుంచి జూలై 31 మధ్యలో చెల్లించేవారికి మాత్రమే వర్తిస్తుందని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఆ జీవోలో పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఎల్ఆర్ఎస్ కోసం భవన యజమానుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. కొన్ని వివాదాలు, హైకోర్టులో పిటిషన్ల కారణంగా గందరగోళం నెలకొన్నది. గతేడాది జూన్‌లో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్‌పై స్పష్టత ఇచ్చి పాత దరఖాస్తులకు కదలిక తెచ్చింది. ఎల్ఆర్ఎస్ ఫీజుతో పాటు ఇతర చార్జీలను చెల్లించేలా ఉత్తర్వులు ఇచ్చింది. అయినా కొద్దిమంది యజమానులు ఫీజు చెల్లించలేదు. అలాంటివారికి మరోసారి అవకాశం ఇచ్చేలా తాజాగా జీవోను ఎంఏయూడీ జారీచేసింది.

