కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. సాయంత్రం 5గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగనున్నది. రాష్ట్రంలోని మొత్తం 2996 వార్డులకు గాను ఇప్పటికే 14 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మక్తల్ లోని 6వ వార్డు ఎన్నిక వాయిదా పడటంతో ప్రస్తుతం 2995 వార్డులకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. సుమారు 25 వేల మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఫిబ్రవరి 13న ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. అనంతరం ఫిబ్రవరి 16వ తేదీన మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లతో పాటు కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించనున్నారు.


