కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఎమ్మెల్సీ (Telangana MLC)ల నియామక ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవుల ఆమోదానికి సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) గవర్నర్‌కు జూలై 22వ తేదీ వరకు సమయం ఇచ్చింది. అటార్నీ జనరల్ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి నెలలోనే కొత్త గవర్నర్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో, ఈ ఫైళ్లను పరిశీలించడానికి మరింత సమయం కావాలని అటార్నీ జనరల్ కోర్టును కోరారు.
ఈ సందర్భంగా అటార్నీ జనరల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీల (Telangana MLC) నియామకం అనేది పూర్తిగా గవర్నర్, ప్రభుత్వానికి మధ్య ఉండే అంశమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన నామినేషన్లు నిబంధనల ప్రకారం సరిగ్గా ఉంటే గవర్నర్ ఆమోదిస్తారని, లేనిపక్షంలో వాటిని తిరస్కరించే అధికారం గవర్నర్‌కు ఉంటుందని వెల్లడించారు. అయితే, అటార్నీ జనరల్ వాదనలపై స్పందించిన సుప్రీంకోర్టు, ప్రస్తుతం గవర్నర్, ప్రభుత్వం ఒకే తాటిపై లేరా అని ప్రశ్నించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఈ జాప్యం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. ఏప్రిల్ 30వ తేదీ లోపు ఏదైనా చట్టసభకు ఎన్నిక కాకపోతే లేదా నామినేట్ కాకపోతే, ప్రస్తుతం మంత్రి పదవిలో ఉన్న అజారుద్దీన్ తన పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆరు నెలల గడువు ముగుస్తున్న తరుణంలో, గవర్నర్ నిర్ణయం జూలై వరకు వెళ్లడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందా లేక సుప్రీంకోర్టు తీర్పు కోసం వేచి చూస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Read Also: భారత రెజ్లింగ్ కోచ్‌గా షాకో బెంతినీడిస్ కంబ్యాక్ !
Follow Us On: X(Twitter)

