కలం, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం కీలక సమావేశం (Telangana cabinet meeting) నిర్వహించనుంది. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రంలోని పాలనాపరమైన, రాజకీయ పరమైన అనేక అంశాలపై చర్చించి ముఖ్య నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె అంశంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. వారి 32 డిమాండ్లతో పాటు ఆర్టీసీ విలీన ప్రక్రియపై కూడా కేబినెట్ ఒక స్పష్టతకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనితో పాటు వివిధ ఉద్యోగ సంఘాల నుంచి వస్తున్న వినతులపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనుంది.
నీటి పారుదల రంగానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై మంత్రుల బృందం సమాలోచనలు చేయనుంది. ముఖ్యంగా పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే వీలుంది. అలాగే మెట్రో స్వాధీన ప్రక్రియ మరియు రాష్ట్రంలో త్వరలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి కూడా ఒక అధికారిక స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకానికి సంబంధించి విధివిధానాలను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. జూన్ 2 నుంచి ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాజకీయ నియామకాల విషయానికి వస్తే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లపై చర్చ జరిపి తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. దీనితో పాటు సీపెక్ నిర్వహించిన కుల సర్వే వివరాలు, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలు తీరుపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు.
వ్యవసాయ రంగానికి సంబంధించి ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించే అంశంపై క్యాబినెట్ సానుకూల నిర్ణయం తీసుకునే వీలుంది. ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం, పలు కంపెనీలకు పరిశ్రమల ఏర్పాటు నిమిత్తం భూముల కేటాయింపు వంటి అంశాలు కూడా ఈ అజెండాలో ఉన్నాయి. చివరగా సామాజిక బాధ్యత కింద కంపెనీలు వెచ్చించే సీఎస్ఆర్ ఫండ్స్ శాతాన్ని పెంచే అంశంపై కూడా మంత్రుల మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అధికారికంగా వెల్లడించనున్నారు.

